Thatikonda Rajaiah: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేకుండా పోతుందన్నారు. కేశవనగర్ గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజయ్య.
స్టేషన్ ఘన్ పూర్ కు నేనే సుప్రీం..(Thatikonda Rajaiah)
అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయని, డప్పు కొట్టాలన్నా, ఫ్లెక్సీలు కట్టాలన్నా భయపడుతున్నారని మనో వేదన చెందారు. కోలాటమాడాలన్నా జనం భయపడుతున్నారు, ఎందుకు అభద్రత భావంలో ఉన్నారో నాకు అర్దం కావట్లేదంటున్నారు రాజయ్య. జనవరి 17 వరకు తానే ఎమ్మెల్యేనని, స్టేషన్ ఘన్ పూర్ కు నేనే సుప్రీం అని రాజయ్య వెల్లడించారు. రెండు సార్లు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్యకు ఈ సారి కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్టు ఇవ్వలేదు. రాజయ్య స్దానంలో ఈ సిగ్మెంట్ నుంచి కడియం శ్రీహరి పోటీ చేస్తారని ప్రకటించారు. దీనిపై రాజయ్య పలు సార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. తాను వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసారు. దీనితో కొద్ది రోజుల కిందట రాజయ్యను రైతు బంధు కమిటీ చైర్మన్ గా నియమించారు. అదేవిధంగా జనగామ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కూడా ఈ సారి టిక్కెట్టు దక్కలేదు. అక్కడనుంచి పల్లా రాజేశ్వర రెడ్డికి టిక్కెట్టు ఇచ్చారు. ముత్తిరెడ్డిని ఆర్టీసీ చైర్మన్ గా నియమించారు.