Site icon Prime9

Banni Utsavam : కర్రల సమరానికి సిద్దమైన దేవరగట్టు.. ఉత్సవం కోసం భారీగా చేరుకున్న భక్తులు

huge crowd gathered for banni utsavam at devaragattu in kurnool district

huge crowd gathered for banni utsavam at devaragattu in kurnool district

Banni Utsavam : దసరా సందర్భంగా.. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు లో జరిగే కర్రల సమరం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దేవరగట్టు గ్రామం వద్ద కొండపై మాళమ్మ, మల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో దసరా పర్వదినాన.. అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాలగుట్టు, రక్షపడ, శమీవృక్షం, బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో విగ్రహాలను ఊరేగిస్తారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం 3 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి ఉత్సవ విగ్రహాల ముందు కర్రలతో తలపడతారు. దీన్నే బన్ని ఉత్సవం అని కూడా పిలుస్తారు.

ఇక ఇప్పటికే ఈ రోజు ఉదయం గంగిపూజ పంచామృత అభిషేకం, హారతి హోమం, రుద్రాభిషేకాలను అర్చకులు నిర్వహించారు. పూజ కార్యక్రమాలకు హాజరైన భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం క్షేత్ర సంప్రదాయం ప్రకారం స్వామి వార్లకు మరో మారు పూజలను చేయనున్నారు. అర్ధరాత్రి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. బన్నీ ఉత్సవాన్ని వీక్షించేందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ ఉత్సవ ఏర్పాట్ల కోసం కలెక్టర్‌ సృజన, ఎస్పీ కృష్ణకాంత్‌ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మాళమ్మ, మల్లేశ్వరస్వామి వార్లు.. రాక్షస సంహారం చేసిన తర్వాత బన్ని ఉత్సవం నిర్వహిస్తారు. తమ ఇలవేల్పు దైవాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం.. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా, ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్‌ గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడతారు. ఇందులో ఇరువర్గాల వారు తీవ్రంగా గాయపడతారు. ఇదే ఆచారం అనాదిగా వస్తోంది. కాగా మరోవైపు పోలీసులు దేవరగట్టు పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డ్రోన్‌ కెమెరాలు, మఫ్టీ పోలీసు బృందాలతో నిఘా ముమ్మరం చేశారు. బన్ని ఉత్సవంలో హింసను అరికట్టాలని న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసినా.. ఫలితం ఉండటం లేదు. అధికారులే దగ్గరుండి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

ప్రభుత్వం ఈ ఉత్సవాల ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. సుమారు 2000 వేల మంది పోలీసులు మోహరించారు. పోలీసుల తో పాటు 100 మంది రెవెన్యూ 100 మంది విద్యుత్ శాఖ సిబ్బంది 100 మందు వైద్య ఆరోగ్య సిబ్బంది వారి తో పాటు గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది కూడా విధులు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ ఉత్సవాల్లో గాయపడే భక్తుల చికిత్స కోసం 100 పడకల తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేశారు. తీవ్రంగా గాయపడ్డ వారిని ఇతర ప్రాంతాలకు చేర్చేందుకు అంబులెన్స్ ను సిద్ధం చేశారు.

 

Exit mobile version