High Temparatures:తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం దాల్చుతున్నాడు. నిన్న ఏపీలో అత్యధికంగా 47 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లాలోని ఎండ్రపల్లిలో రికార్డ్ స్థాయిలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మార్కాపురంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది.
156 మండలాల్లో వడగాలులు..(High Temparatures)
దీంతోపాటు బనగానపల్లెలో 46.7, నెల్లూరు జిల్లాలో 46.6, జమ్మలమడుగులో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమో కాగా.. అనంతపురం, కర్నూలు, పల్నాడు జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 14 జిల్లాలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు. ఇవాళ ఏపీలోని 156 మండలాల్లో వడగాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ.. 28 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో నేడు ఉత్తరాంధ్రకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో 13 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ..
మరోవైపు తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని భారత వాతవరణ విభాగం తెలిపింది. నేడు రాష్ట్రంలోని కరీంనగర్, నల్గొండ. సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, భూపాలపల్లిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు, ఎల్లుండి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో హై టెంపరేచర్స్ నమోదయ్యే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. దీంతో ఐఎండీ నేడు తెలంగాణలోని 13 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. దీంతోపాటు రేపు, ఎల్లుండి 18 జిల్లాలకు సైతం రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు శీతల పానియాలు సేవించాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఇళ్లనుంచి బయటకు రాకుండా చూడాలని వెల్లడించారు.