Prime9

CID Enquiry: మాజీ మంత్రి నారాయణపై సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతి

CID Enquiry: మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమతిచ్చింది. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు.సీఐడీ నోటీసులను సవాల్‌ చేస్తూ నారాయణ వేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో నారాయణను సీఐడీ విచారించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా సీఐడీ విచారణకు సహకరించాలని నారాయణను హైకోర్టు ఆదేశించింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో 160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద ఏపీ సీఐడీ పోలీసులు మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను మాజీ మంత్రి నారాయణ ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. మాజీ మంత్రి నారాయణకు శస్త్రచికిత్స జరిగిన విషయాన్ని ఆయన తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైద్రాబాద్ కూకట్‌పల్లిలోనే మజీ మంత్రి నారాయణను విచారించాలని నారాయణ తరపు న్యాయవాది కోరారు.వయస్సు,ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నారాయణను కూకట్ పల్లిలోని ఆయన నివాసంలోనే విచారించాలని ఏపీ హైకోర్టు నేడు ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేర్పులు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.ఈ ఏడాది మే 10వ తేదీన మాజీ సీఎం చంద్రబాబునాయుడుసహా మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ కేసులు నమోదు చేసింది.ఈ కేసులో చంద్రబాబును ఏ-1గా, నారాయణను -2 గా సీఐడీ చేర్చింది.

Exit mobile version
Skip to toolbar