Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం.. దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. సముద్ర మట్టం నుండి 1.5 అలాగే 5.8 కి.మీ ఎత్తులో నైరుతి దిశగా ఆవర్తనం విస్తరించింది.
మోస్తరు నుంచి భారీ వర్షాలు..( Heavy Rains)
వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో వచ్చే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇవాళ, రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే హైదరాబాద్ తోపాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, జనగామ, సిద్దిపేట తదితర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.