Konidela NagaBabu: వైకాపా నేతలు, మంత్రులు సినీ నటుడు చిరంజీవిపై చేస్తున్న వ్యాఖ్యలపట్ల ఆయన సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ట్విట్లర్‌లో తీవ్రంగా స్పందించారు. శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అణా పైసలతో సహా కట్టి, వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి, 24 క్రాఫ్ట్‌లకి అన్నం పెడుతున్న ఏకైక పరిశ్రమ చిత్రపరిశ్రమని నాగబాబు గుర్తు చేశారు.. అయితే నిజం మాట్లాడిన వ్యక్తి మీద ఆంధ్రా మంత్రులు విషం కక్కుతున్నారని నాగబాబు విమర్శించారు.
ఆయన ఫొటో కోసం పడిగాపులు కాసి..(Konidela NagaBabu)
ఆయన ఫొటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఆయన మీద కారు కూతలు కూస్తున్నారని. ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ ముఖం మీదే పడుతుందని నాగబాబు హెచ్చరించారు. మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు, అభివృద్ధి అనేదానికి అర్థమే తెలియదని నాగబాబు విరుచుకు పడ్డారు.బటన్ నొక్కి కోట్లల్లో ముంచి వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా..? అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగలలేదనుకుంటున్నారని నాగబాబు ఎద్దేవా చేశారు. మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటే అర్థం అవుతుందని నాగబాబు అన్నారు. మీ దౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకి ఎండ్‌కార్డ్ దగ్గర్లోనే ఉందని నాగబాబు హెచ్చరించారు. కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుంది… ఆరోగ్యాలు జాగ్రత్త అంటూ ట్విటర్ వేదికగా గట్టి సమాధానం ఇచ్చారు నాగబాబు.