Harirama Jogaiah: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సంచలన బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి అని, ఇందులో రెండవ మాట లేదని టిడిపి ప్రధాన నారా లోకేష్ ప్రకటించడాన్ని మీరు అంగీకరిస్తున్నారా అని జోగయ్య నిలదీశారు. అనుభవస్తుని నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలి అని పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు ప్రకటించారు కనుక అందరి మాట ఇదే అని లోకేష్ చెప్పారని జోగయ్య గుర్తు చేశారు.
జనసైనికుల కలలు ఏం కావాలి? ..( Harirama Jogaiah)
లోకేష్ బాబు ఆశిస్తున్నట్లుగా చంద్రబాబు గారినే పూర్తి కాలం ముఖ్యమంత్రిగా చేయటానికి మీ ఆమోదం ఉందా? అని జోగయ్య ప్రశ్నించారు. మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేబట్టటం ద్వారా బడుగు బలహీనవర్గాలు యాచించే స్థితినుండి శాసించే స్థితికి రావాలి అని కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నారని జోగయ్య సూటిగా అడిగేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రెండే రెండు కుల నాయకులు రాజ్యమేలుతున్నారని జోగయ్య అన్నారు.80 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షమెప్పుడు? మీరు పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకొక దారి చూపిస్తారని, నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి మీరు చెప్పే సమాధానం ఏమిటని జోగయ్య వరుస ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలన్నిటికీ మీ నుండి జన సైనికులకు సంతృప్తికరమైన సమాధానాలను ఆశిస్తూ రాజ్యాధికారాన్ని చేబట్టే విషయంలో మీ వైఖరి ఏమిటో జన సైనికులందరకు అర్ధమయ్యేటట్లు చెప్పాల్సిందిగా కోరుతున్నామని జోగయ్య తన లేఖని ముగించారు.