Gidugu Rudraraju: ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.
ఓటు బ్యాంకును పెంచుకోవాలని..( Gidugu Rudraraju)
నిన్న మణిపూర్‌లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు.2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమయింది. తమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా విభజన చేసారంరటూ నేతలు కాంగ్రెస్ ను వదిలిపెట్టారు. వీరిలో మెజారిటీ వర్గం వైఎస్సార్ కాంగ్రెస్ వైపు, మిగిలిన వారు టీడీపీ వైపు చేరిపోయారు. దీనితో రెండు దశాబ్దాలుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది. అయితే ఇటీవల కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఢిల్లీలో అగ్రనేతలకు ఏపీ పై కన్ను పడింది. విభజన అనంతరం పదేళ్లుగా పరిపాలిస్తున్న మోదీ సర్కార్ ప్రత్యే హోదా హోమీని అటకెక్కించింది. ఏపీ ప్రజల సెంటిమెంట్ అయిన ఈ హోదాను తాము కేంద్రంలోకి అధికారంలోకి వస్తే తప్పకుండా ఇస్తామంటూ రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఇప్పటికిప్పుడు పార్టీని పూర్తిగా పునరుద్దరించలేకపోయినా ఓటు బ్యాంకును పెంచుకోవాలని రాహుల్ భావించారు. ఇందులో భాగంగా ప్రజాకర్షణ గల వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించారు. దివంగత సీఎం వైఎస్సార్ కుమార్తెగా ఉన్న గుర్తింపు తమకు లాభిస్తుందని కాంగ్రెస్ పార్టీ అంచనా. అదే సమయంలో సీఎం జగన్ పై అసంతృప్తితో ఉన్న నేతలను, టీడీపీలో ఉండి అవకాశాలు లేని నేతలను ఆహ్వానించాలని వలసలను ప్రోత్సహించాలన్నది కాంగ్రెస్ అగ్రనేతల ఆలోచనగా ఉంది.