Youths Drowned: కాకినాడ జిల్లా తాళ్ళరేవు లంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ఏడుగురు యువకుల్లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు యువకులు క్షేమంగా ఒడ్డుకి చేరుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు గ్రామం నుండి యానాం ప్రాంతానికి ఈ ఏడుగురు యువకులు విహార యాత్రకి వచ్చారు. గోపలంక పుష్కరఘాట్ వద్ద కార్తీక్ అనే యువకుడు స్నానానికి దిగాడు. అయితే అతను ప్రమాదవశాత్తు మునిగిపోవడాన్ని గుర్తించి మిగిలిన విద్యార్దులు అతడిని కాపాడటానికి నదిలోకి దిగారు. ఈ ప్రయత్నంలో వీరిలో నలుగురు గల్లంతయ్యారు.
యువకులు గల్లంతైన విషయాన్ని ఒడ్డుకి చేరిన వారు చెప్పడంతో విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది. దీంతో అధికార యంత్రాంగం గల్లంతైన నలుగురికోసం గాలింపు చర్యలు చేపట్టింది. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులని ఫణీంద్ర, బాలాజీగా గుర్తించారు. మరో ఇద్దరు రవితేజ, కార్తీక్‌కోసం గాలింపు కొనసాగుతోంది. విహారయాత్రకి వచ్చిన వారంతా 20నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్కులని పోలీసులు తెలిపారు.