Praja Bhavan: బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించిన ఘటన కలకలం రేపింది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నిర్లక్ష్యంగా కారు నడిపిన అబ్దుల్ ఆసిఫ్‌పై కేసు నమోదు చేశారు. కానీ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కారు నడిపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పరారీలో షకీల్ కొడుకు..(Praja Bhavan)
కేసు నమోదు సమయంలో అసలు నిందితుడిని తప్పించి మరొకరి పేరు చేర్చినట్టు తెలుస్తోంది. పంజాగుట్ట పోలీసులు మాత్రం డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని వైద్యపరీక్షల నిమిత్తం ట్రాఫిక్ పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు పరారీలో ఉన్నారు.అయితే ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ప్రమేయం ఉందని పోలీసు ఉన్నతాధికారులకి పక్కా సమాచారం అందింది. 2022లో జూబ్లీహిల్స్‌లో ఒక SUVని నిర్లక్ష్యంగా నడిపి పసిబిడ్డను చంపిన కేసులో కూడా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత కేసు పర్యవేక్షణ బాధ్యతలని డిసిపికి అప్పగించారు.
వాస్తవాలను దాచిపెట్టడంలో ఇన్‌స్పెక్టర్ దుర్గారావు సహకరించారని ఆరోపణలున్నాయి. విషయం పోలీసు ఉన్నతాధికారులకి తెలిసిందన్న సమాచారం అందడంతో పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు పోలీస్ స్టేషన్‌లోనే స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కేర్ ఆస్పత్రికి తరలించారు.