Khammam: మంగళవారం గొత్తి కోయల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అంత్యక్రియలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా చండ్రగుంట మండలం బెండలపాడు పోడుభూముల వివాదంలో ఫారెస్ట్ రేంజ్ ఆపీసర్ (ఎఫ్ఆర్వో) శ్రీనివాసరావును స్థానిక గొత్తికోయలు దాడిచేసి హతమార్చిన విషయం తెలిసిందే.
స్వగ్రామం ఇర్లపూడిలో బుధవారం అధికారిక లాంఛనాలతో శ్రీనివాసరావు ఆంత్యక్రియలు ముగిసాయి. అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ , అలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి స్వయంగా పాడెమోసారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులపై దాడులను సహించేది లేదన్నారు. ఫారెస్ట్ అధికారి హత్యను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని తెలిపారు. ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావుపై దాడి చేసి అతి కిరాతకంగా చంపిన ఎవ్వరినీ వదిలిపెట్టబోమని అన్నారు.
ఇతర రాష్ట్రాల నుండి వలసవచ్చిన గొత్తికోయలే ఈ దారుణానికి పాల్పడ్డారని… స్థానిక గిరిజనులతో ఎలాంటి సమస్య లేదన్నారు. వలసవచ్చిన వారు అడవులను విచక్షణ రహితంగా నరికినట్లే అధికారులను నరుకుతామంటే ఊరుకునేది లేదన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని మంత్రులు హెచ్చరించారు.