Bhadradri Kothagudem: తెలంగాణలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాక సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడెం ప్రాజెక్టు వద్ద కనీవినీ ఎరుగని వరదను చూశాం. క్లౌడ్ బరస్ట్ కారణంగానే అలా అకస్మాత్తు వరదలు వస్తాయి. ఇతర దేశాల వాళ్లు మన దేశం మీద క్లౌడ్ బరస్ట్ కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కుట్రలు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది అని పేర్కొన్నారు.
ఒక్కో కుటుంబానికి రూ.10 వేల సాయం..
ముంపు బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని.. రెండు నెలల పాటు బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. భద్రాచలంలో ముంపు కాలనీల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని, వారి కోసం సింగరేణి సంస్థతో కలిసి రూ.1,000 కోట్లతో ఎత్తయిన ప్రాంతంలో కొత్త ఇళ్లతో కాలనీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ కాలనీ శంకుస్థాపనకు తానే స్వయంగా వస్తానని చెప్పారు. ఆ పర్యటనలో ఆలయం, పట్టణ అభివృద్ధి పనుల విషయాలు మాట్లాడుతాన్నారు.
భవిష్యత్‌లో భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు ముంపు భయం లేకుండా చర్యలు చేపడతామని, దీనిపై ఐఐటీ ప్రొఫెసర్లు, సీడబ్ల్యూసీ ఇంజనీర్లు, రాష్ట్రానికి చెందిన నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. భద్రాచలం ప్రాంతంలో గత ఐదు వందల ఏళ్ల వర్షపాతం, వరదల వివరాల ఆధారంగా కొత్త లెవల్స్‌ను నిర్ధారిస్తామని చెప్పారు. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రస్తుత కరకట్టను బలోపేతం చేయడంతోపాటు బూర్గంపాడు వైపు అవసరమైన చోట కరకట్టలు నిర్మిస్తామని వెల్లడించారు. విలీన మండలాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూడా ప్రయత్నిస్తామని. దీనిపై ఏపీ అధికారులతో మాట్లాడుతామని కేసీఆర్ చెప్పారు.