Road Accident: ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారి పై గుత్తి మండలం బాచుపల్లి దగ్గర కారు, లారీ ఢీ కొన్న సంఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి.పది రోజుల్లో ఇంట్లో జరగబోయే వివాహం కోసం పెళ్లి బట్టలు కొనడానికి హైదరాబాద్ వెళ్లారు షేక్ సురోజ్ బాషా కుటుంబం .హైదరాబాద్ లో షాపింగ్ అనంతరం అనంతపురానికి తిరుగు ప్రయాణం అయ్యారు .ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు .
డ్రైవర్ నిద్రమత్తు కారణమా !(Road Accident)
అనంతపురంలోని రాణినగర్ లో నివసించే షేక్ సురోజ్ బాషా వివాహం ఈ నెల 27న జరగనుంది. ఈ నేపథ్యంలో ఏడుగురు కుటుంబ సభ్యులు కారులో పెళ్లి బట్టల షాపింగ్ కోసం హైదరాబాద్ వెళ్లారు. తిరిగి వస్తుండగా గుత్తి మండలం బాచుపల్లి గ్రామం వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. సంఘటన స్థలిలోనే ముగ్గురు మృత్య వాత పడ్డారు . తీవ్ర గాయాలు అయిన మరో ఇద్దరు గుత్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
రాణి నగర్ లో విషాద ఛాయలు..
మృతులను అల్లీ సాహెబ్ (58), షేక్. సురోజ్ బాషా (28), మహ్మద్ అయాన్ (6), అమాన్ (4), రెహనాబేగం (40)గా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు .వీరి మరణంతో అనంత పురం రాణి నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి .