Site icon Prime9

Employee Healthcare Trust (EHCT): తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంప్లాయి హెల్త్‌ కేర్ ట్రస్ట్ (ఈహెచ్.సి.టి)

Employee Healthcare Trust

Employee Healthcare Trust

Employee Healthcare Trust (EHCT): రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు న‌గ‌దు ర‌హిత, మ‌రింత నాణ్య‌మైన‌ చికిత్స అందించేందుకు ఎంప్లాయిస్‌ హెల్త్ స్కీమ్ కు ప్రత్యేకంగా ఎంప్లాయి హెల్త్‌ కేర్ ట్రస్ట్ (ఈ.హెచ్.సి.టి) ఏర్పాటు చేసి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం అమలు చేయాలని మొద‌టి పీఆర్సీ క‌మిష‌న్ ప్ర‌భుత్వానికి సూచించింది. ప‌థ‌కం అమ‌లుకు ప్ర‌త్యేక ట్ర‌స్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్ర‌భుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా జ‌మ చేయాల‌ని పేర్కొంది. ఈ మేర‌కు త‌మ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గ‌తంలో విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవో పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారి ప్రతిపాదనలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.

చైర్‌ పర్సన్‌గా చీఫ్ సెక్రటరీ..(Employee Healthcare Trust (EHCT))

దీని ప్రకారం ఈహెచ్‌ఎస్‌ అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్ర‌స్ట్ పేరుతో ట్ర‌స్ట్ ఏర్పాటు చేస్తుంది.దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్‌ పర్సన్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం తరఫున.. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, సాధారణ పరిపాలన శాఖల కార్యదర్శులు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌,ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ సీఈవో సభ్యులుగా ఉంటారు. ఈహెచ్‌ఎస్‌ సీఈవో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల తరఫున ఆరుగురిని, పెన్షనర్ల తరఫున ఇద్దరిని ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది. విధాన నిర్ణయాలకు సంబంధించి బోర్డ్‌ సభ్యులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేస్తారు. ఒక ప్ర‌భుత్వ ఉద్యోగిని ఈహెచ్ఎస్ సీఈవోగా నియ‌మిస్తారు.

Exit mobile version