Draksharamam Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులుతో కూడిన విద్యుత్ అలంకరణ చేశారు. ఇది ఆలయానికి అపచారం అంటూ భక్తులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆలయానికి విద్యుత్ అలంకరణ చేస్తారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది నిర్వహించే శరన్నవరాత్రి మహోత్సవాలకు ఈవో తారకేశ్వరరావు అత్యుత్సాహంతో ఆలయానికి వైయస్సార్ జెండా రంగుల విద్యుత్ అలంకరణ చేశారు. భక్తులు మనోభావాలు దెబ్బతినేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులుతో పోలిన విద్యుత్ అలంకరణ చేయడం చర్చానీయాంశమైంది. ఈవో తారకేశ్వరరావు పై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి గ్రామపంచాయితీ కార్యాలయాలు, గ్రామసచివాలయాలు, దిశ పోలీసు స్టేషన్లకు పార్టీ జెండాలను పోలిన రంగులను వేయడం ప్రారంభమయింది. దీనిపై ప్రతిపక్షనేతలు కోర్టుకు వెళ్లడంతో దీనికి చెక్ పడింది. అయితే ఎక్కడయినా అవకాశం వచ్చినపుడల్లా తమ పార్టీ జెండా రంగులను పోలి ఉండేలా రంగులు వేయడం అనే దానిలోనుంచి నేతలు బయటపడటం లేదు. అధికార పార్టీనేతలతో గొడవెందుకని అధికారులు కూడా వీటిపై సైలెంట్ గా ఉంటున్నారు.