Election Code : తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్..

:తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలకావడంతో.. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో తాయిలాలు, నగదు పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలపై ఎన్నికల సంఘం నిఘా మొదలయింది.

  • Written By:
  • Publish Date - October 10, 2023 / 01:04 PM IST

Election Code :తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలకావడంతో.. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో తాయిలాలు, నగదు పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలపై ఎన్నికల సంఘం నిఘా మొదలయింది. ముఖ్యంగా నగదు, బంగారం ఇతర వస్తువులు తరలింపుపై ఆక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు, అదికారుల తనిఖీల్లో సరైన పత్రాలు చూపించకుంటే వాటిని సీజ్ చేస్తారు. ఎన్నికల తర్వాత ఆధారాలు చూపిస్తేనే వాటిని తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసర అవసరాల కోసం, వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, శుభకార్యాలు, ఇతర అవసరాలకు అధిక మొత్తంగా నగదు తీసుకెళ్తున్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

రూ.50వేల వరకే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి..(Election Code)

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అధిక మొత్తంలో నగదు చలామణి విషయంలో ఎన్నికల అధికారులు, పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది అనుక్షణం తనిఖీలు చేస్తున్నారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దులున్న తెలంగాణలో దాదాపు 158 చెక్ పోస్టులు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ క్రమంలో స్థానికంగా, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే తీసుకెళ్తున్న నగదుకు సంబంధించిన తగిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంటఉంచుకోవడం మంచిది. నిబంధనల ప్రకారం రూ.50వేల వరకే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కేవలం నగదు మాత్రమే కాకుండా బంగారం, ఇతర ఆభరణాలు భారీ స్థాయిలో తీసుకెళ్లినా ఇబ్బందేనని స్పష్టం చేస్తున్నారు.

లావాదేవీల వివరాలు సమర్పించాలి..

ఒకవేళ రూ.50వేల కంటే ఎక్కువ నగదు తరలించాల్సివచ్చే అందుకు సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలి. ఆసుపత్రిలో చెల్లింపుల కోసం ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్తె రోగి రిపోర్టులు, ఆసుపత్రి రశీదులు, ఇతర డాక్యుమెంట్లు తమ వెంట ఉంచుకోవాలి. ఏదైనా అవసరాల కోసం బ్యాంకు నుంచి నగదు డ్రా చేస్తే ఖాతా పుస్తకం లేదా ఏటీఎం చీటీ వంటివి తప్పనిసరిగా తమవద్ద పెట్టుకోవాలి. వస్తువులు, ధాన్యం విక్రయం డబ్బు అయితే వాటికి సంబంధించిన బిల్లు చూపించాలి. వ్యాపారం, ఇతర సేవల కోసం డబ్బు వినియోగిస్తే తనిఖీల సమయంలో లావాదేవీల వివరాలను ఆధారంతో అధికారులకు చూపించాలి. భూమి విక్రయించిన సొమ్ము అయితే వాటికి దస్తావేజులు చూపాలి. ఎక్కువ మొత్తంలో నగదు లభ్యమైతే ఐటీ, జీఎస్టీ అధికారులు కూడా రంగంలోకి దిగుతారు. వాటికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు చూపిస్తేనే తిరిగి ఇస్తారు.