Harirama Jogaiah: రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అన్నారు. రాష్ట్ర ప్రజలలో పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా కొందరు వైసీపీ సానుబూతి పరులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
టీడీపీ -జనసేన పార్టీల మైత్రి బంధాన్ని దెబ్బతీసే విధంగా ఒక అసత్య ప్రచారానికి తెరలేపారని జోగయ్య మండిపడ్డారు. వైసీపీ సానుభూతి పరులు, నాయకులు ఒక అబద్దపు లేఖ ను “కాపు సామాజిక వర్గానికి ఒక విన్నపం” అనే శీర్షికతో ఎవరో అగంతకులు నకిలీ లెటర్ విడుదల చేసినట్లు జోగయ్య చెప్పారు. ఇవాళ నకిలీ లెటర్ తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు, జన సైనికులు ఈ విషయాన్ని గమనించాలని హరిరామ జోగయ్య కోరారు.
టీడీపీ, జనసేన పార్టీల కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయం జరుగుతుందని హరిరామజోగయ్య తెలిపారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో జనసేన, టీడీపీల మైత్రి బంధాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా మరెన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారని హరిరామజోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు వైసీపీ ట్రాప్ లో పడకూడదని సూచించారు. తప్పుడు వార్తలను నమ్మకుండా ఎవరెన్ని పన్నాగాలు పన్నినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే వరకూ అందరూ పవన్ కళ్యాణ్ వెంటే ఉండాలని జనసైనికులకు హరిరామజోగయ్య పిలుపునిచ్చారు.