Telangana Governor Tamilisai : తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినీ విమర్శించాలన్నది తన ఉద్దేశం కాదని చెప్పారు. సోమవారం ఉస్మానియా ఆస్పత్రిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సందర్శించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న కులీకుతుబ్ షా భవనంలోని మొదటి , 2వ అంతస్థులో ఉన్న కార్డియాలజీ విభాగాన్ని , ల్యాబ్‌ను పరిశీలించారు. వార్డులో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ కార్యాలయంలో డాక్టర్ బి. నాగేందర్ , వివిధ విభాగాల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఒక్కో బెడ్‌పై ముగ్గురు చిన్న పిల్లలు..(Telangana Governor Tamilisai)
అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళిసై ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు తనకి లేదా అని ప్రశ్నించారు. ఉస్మానియాలో ఒక్కో బెడ్‌పై ముగ్గురు చిన్న పిల్లల్ని ఉంచారని తమిళి సై అన్నారు.ఉస్మానియాలో కనీసం 3000 నుంచి 4000 బెడ్స్ ఉండాలి.మూడు భవంతుల్లో ఉండాల్సిన రోగులను ఒక్క భవనంలో ఉంచుతున్నారు. ఆసుపత్రి భవనాన్ని విస్తరించాలని చాలాసార్లు చెప్పాము.రోగులకి చోటు చాలడం లేదని అనేక మార్లు ప్రభుత్వానికి చెప్పాము.నన్ను విమర్శించేకంటే సమస్యలు పరిష్కరిస్తే సంతోషిస్తాను. కానీ నేను రాజకీయ నేతలా మాట్లాడుతున్నాను అనడం సరికాదని తమిళిసై అన్నారు.
మరోవైపు తెలంగాణ వైద్య రంగంపై పదే పదే విమర్శలు చేస్తున్న గవర్నర్ తమిళిసైపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు తెలిసో తెలియకో లేదా మిడిమిడి జ్ఞానంతోనో తెలంగాణ సర్కార్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు అన్నారు. దీనిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని హరీష్ రావు చెప్పారు. వారి సంగతి దేవుడే చూసుకుంటాడని హరీష్ రావు అన్నారు.