CM KCR Comments:నిర్మల్ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించారు. కొత్త కలెక్టరేట్ భవనంతో పాటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రతిపక్షాలపై విమర్శలు కురిపిస్తూనే.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కేసీఆర్ వివరించారు.
నిర్మల్ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు కురిపించారు. జిల్లాలో 396 గ్రామ పంచాయతీలకు.. ఒక్కో గ్రామ పంచాయతీ అభివృద్ధికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీకి 25 కోట్లు మంజూరు చేశారు. ధరణి పోర్టల్ తీసేయాలన్న ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ధరణి పోర్టల్ తీసేస్తే మళ్లీ పైరవీకారులు చెలరేగిపోతారన్నారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతామనే వారినే బంగాళాఖాతంలో కలుపుదామని హెచ్చరించారు.చెరువులన్నీ ఒకప్పుడు ఎండిపోయి గందరగోళంగా ఉండేవని… ఇవాళ బ్రహ్మాండంగా చెరువులను నింపుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు.
ఎస్సారెస్పీ ద్వారా నిర్మల్, ముధోల్ నియోజక వర్గాలకు లక్ష ఎకరాలకు నీరు రాబోతుందని వెల్లడించారు. ఈ నెల 8న గ్రామాల్లో చెరువుల పండుగ జరుపుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.ఉమ్మడి ఆదిలాబాద్‌కు 4 మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఏ రాష్ట్రంలో అయినా రైతుబంధు ఉందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్‌పై ఫోకస్ పెడతామని అన్నారు. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. ఇప్పుడు 24 గంటలూ రైతులకు ఉచిత కరెంట్. సాగు, తాగునీరు సమస్య పరిష్కరించుకున్నాం. రాష్ట్రం ఇలానే సుభిక్షంగా ఉండాలంటే మీ మద్దతు కావాలని సీఎం కేసీఆర్ అన్నారు.