Harirama Jogaiah: ఏపీ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణని మానుకోవాలని, అభివృద్ధి అంతా అమరావతిలో కేంద్రీకరించడాన్ని కూడా వదిలేయాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సూచించారు. రాజధాని వ్యవహారంపై విశ్లేషణ చేస్తూ జోగయ్య ఓ సంచలన లేఖ విడుదల చేశారు.
అభివృద్ధి వికేంద్రీకరణకు పూనుకోవాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధిచెందేటట్లు కార్యాచరణ అమలు చేయాలని జోగయ్య కోరారు. మరోసారి రాష్ట్ర విభజనలకు తావు యివ్వకుండా ఉండాలంటే ఈ అంశాలే అన్ని పార్టీల ఎన్నికల హామీలు కావాలని జోగయ్య సలహా ఇచ్చారు. తదనుగుణంగానే జనసేనాని పవన్ కల్యాణ్ తన నిర్ణయాన్ని ప్రకటించడం రాష్ట్రప్రయోజనాల దృష్ట్యా శ్రేయస్కరమని జోగయ్య అన్నారు.
మూడు రాజధానుల విషయాన్ని వదలరు..(Harirama Jogaiah)
ఎన్ని అభ్యంతరాలు వచ్చినా మూడు రాజధానుల వ్యవహారాన్ని పాలక పక్షం వదిలేలా లేదని జోగయ్య అంచనా వేశారు. దసరా నాటికి సిఎం నివాసాన్ని, సిఎంఓని విశాఖలో ప్రారంభించడం ఖాయం అన్నట్లుగా ప్రకటనలు వస్తున్నాయని జోగయ్య గుర్తు చేశారు. అమరావతి ప్రాంతాన్నే రాజధానిగా కంటిన్యూ చెయ్యాలనేది జనసేనతో కూడిన అన్ని రాజకీయపార్టీల ఏకాభిప్రాయ నిర్ణయమని జోగయ్య తెలిపారు. అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉన్న అమరావతినే రాజధానిగా కంటిన్యూ చేయాలన్నది కూడా జనసేన నినాదమని జోగయ్య గుర్తు చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న 31 గ్రామాల్లో రెండింటిలో కాపుల పెత్తనం ఉంటే 29 గ్రామాలు కమ్మవారి పెత్తనంలో ఉన్నాయి కాబట్టే అమరావతికి బదులు మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారని జోగయ్య విశ్లేషించారు. రెండవది విశాఖలో ల్యాండ్ మాఫియా ద్వారా జేబులు నింపుకోవటం కూడా సిఎం జగన్ ఎత్తుగడల్లో ఒకటని జోగయ్య చెప్పారు. ఉత్తరాంధ్ర, ఉత్తరకోస్తా, దక్షిణకోస్తా, రాయలసీమ అనే నాల్గు ప్రాంతాలకు పరిపాలన వికేంద్రీకరణ జరిగి ఉండాల్సిందని జోగయ్య అన్నారు.
అమరావతిలోని కమ్మవారి పెత్తనంలో ఉన్న గ్రామాలు, రియల్ ఎస్టేట్ ద్వారా తనకి కావల్సిన వాళ్ళ ఆస్తుల విలువ పెంచడమే చంద్రబాబు లక్ష్యమని అధికార పక్షం ఆరోపణలు చేస్తోందని జోగయ్య అన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చడం లాభకరం కాదన్నది పవన్ కళ్యాణ్ అభిలాష అని జోగయ్య చెప్పారు. రాష్ట్రానికి మధ్యలో ఉన్న అమరావతి అన్ని ప్రాంతాలకి అందుబాటులో ఉందన్నది పవన్ కళ్యాణ్ భావన అని జోగయ్య తెలిపారు. అయితే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుగార్ల నిర్ణయాలలోని లోగుట్టుని పవన్ కళ్యాణ్ లోతుగా వెళ్ళి పరిశీలించినట్లు లేదని జోగయ్య అన్నారు. నిజానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది ప్రజల కోరికని జోగయ్య గుర్తు చేశారు. అందుకుగాను పరిపాలనను వికేంద్రీకరించపనిలేదని జోగయ్య స్పష్టం చేశారు. పరిపాలనంతా అమరావతిలో కేంద్రీకరించవచ్చని జోగయ్య సూచించారు. అభివృద్ధి మాత్రం కేంద్రీకరించకుండా ప్రాంతాలవారీగా, జిల్లాలవారీగా వికేంద్రీకరించాలని జోగయ్య సలహా ఇచ్చారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని ఆంధ్రప్రాంతంలో ఉంటే హైకోర్టు రాయలసీమలో సుప్రీంకోర్టు అనుమతితో ఏర్పాటు చేయాలని జోగయ్య సూచించారు.
రెండవ రాజధానిగా ప్రకటించాలి..
రెండవ రాజధానిగా ప్రకటిస్తూ ఉభయచట్టసభలని విశాఖకు తరలిస్తే ఉత్తరాంధ్రప్రజలకు కొంతవరకు ఊరట కల్గుతుందని జోగయ్య అన్నారు. ఉత్తరాంధ్రలోను, రాయలసీమలోను పరిశ్రమలను అభివృద్ధిపరచవచ్చని జోగయ్య తెలిపారు. ఉత్తరాంధ్రలోని విశాఖ, రాయలసీమలోని తిరుపతిని ఐ.టి. కేంద్రాలుగా తీర్చిదిద్దాలని జోగయ్య కోరారు. ఫిలిమ్ ఇండస్ట్రీని డెవలప్ చేయటం ద్వారా పర్యాటక ప్రాంతంగాను విశాఖను అభివృద్ధిపరచాలని జోగయ్య ప్రతిపాదించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్రప్రభుత్వమే కొనడం ద్వారా ప్రైవేటుపరం కాకుండా నిరోధించవచ్చని జోగయ్య అన్నారు. శ్రీకాకుళాన్ని మత్స్యశాఖ అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దవచ్చని జోగయ్య తెలిపారు. అలాగే మిగిలిన జిల్లాలని కూడా అక్కడి పరిస్థితులకి అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని జోగయ్య కోరారు.