MLC Kavita : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. ఈ స్కామ్ లో ఈడీ మరో చార్జ్ షీట్ దాఖలు చేయగా, ఇందులోనూ కవిత పేరుని ప్రస్తావించారు ఈడీ అధికారులు. సమీర్ మహేంద్రుపైన ఈడీ దాఖలు చేసిన ఈ చార్జిషీట్ లో సంచలన విషయాలు పేర్కొంది. మరోసారి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈ చార్జిషీటులో ఈడీ పేర్కొంది. సమీర్ కంపెనీలో కవితకు వాటాలు ఉన్నట్లు కూడా ఈడీ వెల్లడించింది.
సమీర్ మహేంద్రు ఛార్జ్ షీట్‌లో ఎమ్మెల్సీ కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, రామచంద్ర పిళ్ళై, అభిషేక్ రావు పేర్లు ఉన్నాయి. ఒబెరాయ్ హోటల్ లో మాగుంట శ్రీనివాస్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసినట్టు ఈడీ విచారణలో పేర్కొన్నారు సమీర్ మహేంద్రు. శరత్ చంద్ర రెడ్డి, అభిషేక్, బుచ్చిబాబు ఢిల్లీలోని ఓ హోటల్లో సమీర్ మహేంద్రు కలిసినట్టు ఈడీ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది.
28 వేల సార్లు చెప్పించినా అబద్దం నిజం కాదు: కవిత
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ వేశారు. అబద్ధం నిజం కాదు కాదంటూ సెటైర్లు విసిరారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరును మరోసారి ఈడీ ప్రస్తావించడంపై వార్తపత్రికల్లో వచ్చిన కథనాన్ని షేర్ చేసిన.. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆమెపై విమర్శలు చేశారు. కవితను లిక్కర్ క్వీన్ అని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. చార్జిషీట్‌లో లిక్కర్ క్వీన్స్ పేరు 28 సార్లు ప్రస్తావించబడింది అని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన కవిత.. రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
రాజగోపాల్ అన్న తొందరపడి మాట జారకు అని పేర్కొన్న కవిత.. 28 వేల సార్లు తన పేరు చెప్పించినా అబద్దం నిజం కాదని పేర్కొన్నారు. ‘రాజగోపాల్‌రెడ్డి అన్న..తొందర పడకు.. నా పేరు 28 సార్లు చెప్పినా.. 28 వేల సార్లు చెప్పిన అబద్ధం నిజం కాదు’ అంటూ కవిత కౌంటర్ వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు ఈడీ ప్రస్తావించడంపై రాజగోపాల్‌రెడ్డి ట్వీట్ వేశారు. ఈ ట్వీట్‌కు కౌంటర్ ట్వీట్ వేశారు కవిత.