Land on the Moon: తల్లి మీద ఉన్న ప్రేమతో ఓ కూతురు ఏకంగా చంద్ర మండలంపైనే ఎకరం భూమిని కొనుగోలు చేసింది. చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించిన తల్లిపై మమకారంతో చంద్రుడిపై స్థలాన్ని కొని రిజిస్ట్రేషన్ చేయించి, మదర్స్ డే సందర్భంగా తల్లికి గిఫ్ట్ ఇచ్చింది.
చంద్రయాన్-3 సక్సెస్ అయిన రోజున..(Land on the Moon)
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచందర్- వకుళాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు సుద్దాల సాయి విజ్ఞత పదేళ్ళ క్రితం అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలోగవర్నర్ కిమ్ రెనాల్స్ వద్ద ప్రాజెక్టు మేనేజర్, ఫైనాన్షియల్ అడ్వయిజర్‌గా పని చేస్తున్నారు. తన కార్యాలయంలో చంద్రుడిపై భూమి కొనుగోలుపై చర్చ జరుగుతుండటాన్ని విజ్ఞత గమనించారు. స్పందించిన సాయి విజ్ఞత తాను తన తల్లికి బహుమతిగా చంద్రుడిపై జాగా కొనివ్వాలని నిర్ణయించుకుంది. మదర్స్ డే సందర్బంగా 2022 మార్చి 8న చంద్రుడిపై భూమి కొనుగోలుకు లూనార్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 23న తన తల్లి వకుళ, మనుమరాలు ఆర్త సుద్దాల పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. చంద్రయాన్-3 విజయవంతం అయిన రోజునే రిజిస్ట్రేషన్ పత్రాలు చేతికందడం విశేషం.