D. Srinivas Resignation: డి.శ్రీనివాస్ యూటర్న్.. నిన్న కాంగ్రెస్ లో చేరిక.. నేడు రాజీనామా..

సీనియర్ పొలిటీషియన్ డి.శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిన్న కాంగ్రెస్‌లో చేరిన డీఎస్ నేడు రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు లేఖ రాశారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు.

  • Written By:
  • Publish Date - March 27, 2023 / 07:21 PM IST

D. Srinivas Resignation:  సీనియర్ పొలిటీషియన్ డి.శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిన్న కాంగ్రెస్‌లో చేరిన డీఎస్ నేడు రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు లేఖ రాశారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. తన కుమారుడు డి.సంజయ్ కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఆశీస్సులు అందించడానికి గాంధీభవన్‌కు వెళ్లిన తనకు కండువా కప్పి పార్టీలో చేరినట్టుగా ప్రచారం చేశారని లేఖలో పేర్కొన్నారు.

ప్రశాంతంగా బతకనీయండి..(D. Srinivas Resignation)

తనను వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై డీఎస్ భార్య విజయలక్ష్మి మరో లేఖ విడుదల చేశారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని.. మీ రాజకీయాలకు డీఎస్‌ను వాడుకోవద్దని విజ్నప్తి చేశారు. మీరు నిన్న పెట్టిన ఒత్తిడికి ఆయనకు ఫిట్స్ వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్‌ను ప్రశాంతంగా బతకనీయండి అంటూ విజయలక్ష్మి లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ కు డీఎస్ రాజీనామా లేఖ రాస్తున్న వీడియోను కూడా ఆమె మీడియాకు రిలీజ్ చేశారు.

కుమారుడితో కలిసి పార్టీలో చేరిన డీఎస్..

డి. శ్రీనివాస్ ఆదివారం గాంధీ భవన్ కు స్వయంగా వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.ఆయనతో పాటు.. కుమారుడు ధర్మపురి సంజయ్ కూడా కాంగ్రెస్ లో చేరారు. ఇవాళ గాంధీ భవన్ కు వచ్చిన ఆయన.. పార్టీ ఇంఛార్జ్ ఠాక్రే, రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.శ్రీనివాస్ తో పాటు ఆయన తనయుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు.డీఎస్ ను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే పార్టీలోకి ఆహ్వానించారు.వీహెచ్.. డీఎస్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే సడన్ గా రాజీనామా చేసి ఆశ్చర్యంలో ముంచారు.

ఉమ్మడి ఏపీలో కీలకనాయకుడిగా డీఎస్..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డి. శ్రీనివాస్ పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు కృషి చేసారు. మంత్రిగా కూడా పనిచేసిన డీఎస్ 2009 ఎన్నికల్లో అనూహ్యంగా  ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఆవిర్బావం తరువాత ఆయన బీఆరఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడు అరవింద్ కేసీఆర్ కుమార్తె కవితను నిజామాబాద్ లో ఓడించిన తరువాత పరిస్దితులు మారాయి. బీఆర్ఎస్ క్యాడర్ ఆయనకు వ్యతిరేకంగా మారింది. దీనితో గత కొంతకాలంగా ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్ ఆదివారం గాంధీ భవన్ కు వీల్ చైర్ లోనే వచ్చారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అరవింద్ బీజేపీలో ఉండటంతో ఆయన కాంగ్రెస్ లో చేరిక కుటంబంలో ఇబ్బందికర పరిస్దితులను తెస్తుందని భావించారని సమాచారం. అందుకే రాజీనామా చేసారని భావిస్తున్నారు.  వాస్తవానికి శ్రీనివాస్ 2021 డిసెంబర్ లో సోనియాగాంధీని కలిసారు. అప్పుడే ఆయన పార్టీలో చేరతారని ఊహాగాానాలు వెలువడ్డాయి. అయితే ఏడాదిన్నర తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన 24 గంటలకే రాజీనామా చేసారు.