Cyclone Michoung: మిచౌంగ్ తుఫాన్ ప్రభావం నేపధ్యంలో ఏపీలోని దక్షిణ కోస్తాకి రెడ్ అలెర్ట్ ప్రకటించారు.చెన్నైకి 130కిలో మీటర్లు, నెల్లూరుకు 220 కిలో మీటర్లు. బాపట్లకు 330 కిలో మీటర్లు, మచిలీపట్నానికి 350 కిలో మీటర్ల దూరంలో మిచౌంగ్ కేంద్రీకృతమైంది. బంగాళాఖాతంలో వాయవ్య దిశగా తుఫాను కదులుతోంది. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తున్న తుఫాను.. మంగళవారం మధ్యాహ్నం నాటికి తీవ్ర తుఫానుగా మారి నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది.
అధికారులకు సెలవులు రద్దు..(Cyclone Michoung)
బాపట్ల సహా పలు తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పలుచోట్ల ఈదురు గాలులు వీస్తున్నాయి. హుద్ హుద్ తుఫాన్‌ని మించి గాలులు వీచే అవకాశం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతోపాటు తిరుపతి జిల్లాలో వర్షం కురుస్తోంది. తుఫాను తీవ్రత దృష్ట్యా జిల్లాల్లో అధికారులకు సెలవులను రద్దు చేశారు. వర్షంతో ఆయా ప్రాంతాల్లో చలి ప్రభావం పెరిగింది. విశాఖపట్నంతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. తుఫాను ప్రభావంతో ఇప్పటికే 140కి పైగా రైళ్ళు రద్దయ్యాయి. పలు విమానాలు కూడా రద్దు చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.