YCP Office Demolished: నిబంధనలకు విరుద్ధంగా ఉందని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చేశారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఇవాళ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పోలీసుల పహారా మధ్య ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో సీఆర్‌డిఏ అధికారులు కూల్చేశారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తయి, శ్లాబ్ కు సిద్ధమవుతున్న టైంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మిస్తున్నారని, అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.
చంద్రబాబు దమనకాండ అన్న జగన్ ..(YCP Office Demolished)
తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేయడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని.. చంద్రబాబు ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని జగన్ పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారని.. అలాగే రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని జగన్ వెల్లడించారు.
ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ పార్టీ తలొగ్గేది లేదని, వెన్నుచూపేది అంతకన్నా లేదుని జగన్ వెల్లడించారు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తామని.. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నానంటూ జగన్ ట్వీట్ చేశారు.