CM KCR: దేశ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల తరగతులను సీఎం కేసీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు.
ప్రతి లక్ష జనాభాకు 22 మెడికల్ సీట్లు..(CM KCR)
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో ఇది మరపురాని రోజని అన్నారు. పదివేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో 2014లో కేవలం ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉంటే ఇపుడు వీటి సంఖ్య 26కి చేరిందని మెడికల్ సీట్ల సంఖ్య 8,515కి చేరిందన్నారు. ప్రతి లక్ష జనాభాకు 22 మెడికల్ సీట్లతో భారతదేశంలోని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను ముందుకు నడిపించారంటూ మంత్రి హరీష్‌రావును కేసీఆర్ ప్రశంసించారు. 2014లో 17,000 ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల పడకలను ప్రస్తుతం 34,000కు పెంచుతున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణా యువతకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయించబడ్డాయి. ఈ విషయంలో హైకోర్టులో సానుకూల తీర్పు వచ్చినందుకు గాను వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ అధికారులను కేసీఆర్ అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వం వైద్య మౌలిక సదుపాయాలను పటిష్టం చేస్తోందని, తెలంగాణ ఇప్పుడు 500 టన్నుల ఆక్సిజన్‌ను ఆసుపత్రి అవసరాలను తీర్చడానికి ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. కేసీఆర్ కిట్లు, పౌష్టికాహార కిట్లు, అమ్మ వొడి వాహనాలు తదితర కార్యక్రమాల వల్ల సంస్థాగత ప్రసవాలు గణనీయంగా పెరిగాయని, 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం నుంచి 2023 నాటికి 76 శాతానికి పెరిగాయని చంద్రశేఖర్ రావు చెప్పారు. ప్రసూతి మరణాల రేటు కూడా తగ్గిందని సీఎం కేసీఆర్ చెప్పారు.