CM KCR: హైదరాబాద్ శివార్లలోని చందానగర్ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. మామూలుగా అయితే ఈ దర్శనానికి అంత ప్రాముఖ్యత ఉండదు .. కానీ అక్కడ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర బస చేశారు. ఈ ఉదయమే గోపన్ పల్లిలో స్వరూపానందేంద్ర స్వామీజీతో కలిసి బ్రాహ్మణ సేవా సదన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ మధ్యాహ్నం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర కూడా ఉన్నారు.
చినజీయర్ ను పక్కనపెట్టి..(CM KCR)
కొంతకాలం క్రితం వరకూ సిఎం కెసిఆర్ చిన్న జీయర్ అంటే ప్రత్యేక అభిమానం చూపించేవారు. ఏ పని చేయాలన్నా జీయర్‌నే సంప్రదించేవారు. కానీ సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా తలెత్తిన విబేధాలతో జీయర్ స్వామిని కేసీఆర్ పక్కన పెట్టేశారు. ఇతర స్వామీజీలని ఆదరించడం మొదలుపెట్టారు. దానిలో భాగంగానే ఇప్పుడు స్వరూపానందేంద్రతో కేసీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.