Ambedkar statue:దేశంలోనే అత్యంత ఎత్తైన (125 అడుగులు) అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. హుస్సేన్ సాగర్ సమీపంలో ఎన్టీఆర్ గార్డెన్స్ కు ఆనుకని ఉన్న స్దలంలో దీన్ని నిర్మించారు. ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి కావడం విశేషం.అందువలన ఈ రోజున విగ్రహం ఆవిష్కరించాలని దీనికి సంబంధించి ఏర్పాట్లు శరవేగంతో పూర్తి చేస్తున్నారు.
అంబేద్కర్ విగ్రహం ప్రాజెక్టు..(Ambedkar statue)
రూ.146.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబడిన అంబేద్కర్ విగ్రహం ప్రాజెక్టు 11 ఎకరాలలో విస్తరించి ఉంది . క్యాంపస్ కోసం ఐదు ఎకరాలు మరియు పార్కింగ్ కోసం ఆరు ఎకరాలు
కేటాయించారు.విగ్రహం తయారీకి 114 టన్నుల కాంస్యం, 360 టన్నుల స్టీల్ ఉపయోగించారు. నాలుగేళ్ల కిందట ప్రారంభమయిన దీని నిర్మాణం కోసం రాజస్థాన్ నుండి ఎర్ర ఇసుకరాయిని తీసుకువచ్చారు. అంబేద్కర్ విగ్రహం వద్ద మ్యూజియం, 100 సీట్లతో కూడిన ఆడియో-విజువల్ ఆడిటోరియం ఉంటాయి. మ్యూజియంలో బాబాసాహెబ్ జీవిత చరిత్రకు సంబంధించిన అనేక వ్యాసాలు మరియు చిత్రాలు ఉంటాయి, సందర్శకుల కోసం ఆడిటోరియంలో ఒక షార్ట్ ఫిల్మ్ ప్లే చేయబడుతుంది. లైబ్రరీని కూడా నిర్ణీత సమయంలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఆవిష్కరణ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు..
శుక్రవారం జరగనున్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, పలువురు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, బౌద్ద గురువులు కూడా హాజరవుతున్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున వీరిని తరలించడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసారు. రాష్ట్రప్రభుత్వం ఈ కార్యక్రమానికి రూ.10 కోట్ల నిధులను విడుదల చేసింది.
హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహాన్ని ప్రముఖ శిల్పులు పద్మశ్రీ, పద్మభూషణ్ గ్రహీత రామ్ వంజీ సుతార్ (98), ఆయన కుమారుడు అనిల్ రామ్ సుతార్ (65) రూపొందించారు.ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో రామ్ సుతార్ ఆర్ట్ క్రియేషన్స్ పేరుతో పనిచేస్తున్న ఈ తండ్రీకొడుకులు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (597 అడుగులు)తో సహా అనేక స్మారక శిల్పాలను రూపొందించారు.