CM Jagan: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. మచిలీపట్నం మండలం (బందరు) తపసిపూడి గ్రామంలో పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ అన్ని ఆటంకాలను అధిగమించి పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించామని సీఎం జగన్ అన్నారు. టీడీపీ మచిలీపట్నానికి తీవ్ర అన్యాయం చేసిందని.. బందర్ కు పోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. త్వరలో మచిలీపట్నం రూపు రేఖలు మారుతాయని.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రగా మచిలీపట్నం ఉండబోతోందని సీఎం జగన్ అన్నారు. చదువుకున్న పిల్లలు ఉపాధికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయని జగన్ చెప్పారు.
550 కోట్లు వ్యయంతో బందరులో వైద్య కళాశాల నిర్మిస్తున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బందరులో అధికారిక యంత్రాంగం వచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటోందని చెప్పారు. మచిలీపట్నాన్ని జిల్లా కేంద్రంగా చేయడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. వచ్చే 24 నెలల్లో పోర్టు నిర్మాణం జరుగుతుందని సీఎం జగన్ ఆకాంక్షించారు.
తూర్పుతీరంలో ఆంగ్లేయులతో పాటు డచ్, పోర్చుగీస్ వారికి సైతం మచిలీపట్నం వ్యాపార కేంద్రంగా విలసిల్లింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పోర్టు నిర్మాణానికి మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్ధ ఏర్పాటు చేశారు. 5వేల,156 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతుల మంజూరు చేశారు. 28 ఫిబ్రవరి 2023న పోర్టు నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతులు, 13 ఏప్రిల్ 2023న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు మంజూరు చేసింది. 2023 మార్చి నెలలో వేయి 923 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి.. నేడు పోర్టు నిర్మాణ పనుల ప్రారంభించారు.