CM Jagan Satires: ఏపీలో జరిగేది క్లాస్ వార్ అని.. సీఎం జగన్ అన్నారు. ఓటు వేసే ముందు అంతా ఒక సారి ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించారు. వైసీపీకి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయని.. టీడీపీకి ఓటు వేస్తే.. పథకాలు ఆగిపోతాయని అన్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో సైకిల్ రిపేరుకు వచ్చిందని.. ఆయన ఎర్ర చొక్కాల నుంచి మొదలు పెట్టి ఢిల్లీ పెద్దల వరకు రిపేర్ల కోసం తిరిగారని ఎద్దేవా చేశారు.
సైకిల్ బెల్ ఒకటే మిగిలింది ..(CM Jagan Satires)
చివరికి సైకిల్ ను బాగు చేసేందుకు అబద్దాల మేనిఫెస్టోను తీసుకు వచ్చారని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిల్లో ప్రజలు లేరని.. అన్ని సంక్షేమ పథకాలను అధికారంలోకి రాగానే మళ్లి బటన్లు నొక్కుతామని తెలిపారు. ఓటు వేసే వారంతా ఒక సారి ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవాలని కోరారు. ఎవరి హయాంలో మంచి జరిగిందో బేరీజు వేసుకోవాలని అభ్యర్థించారు.2019లో అంతా కలిసి సైకల్‌ను ముక్కలుగా విరిచేశారు.సైకిల్‌ని బాగుచేసేందుకు బాబు ముందు ఎర్రచొక్కాల దగ్గరికి వెళ్లారు.వదినమ్మతో సైకిల్‌ను ఢిల్లీకి తీసుకెళ్లారు.ఢిల్లీ మెకానిక్స్‌ను ఇక్కడికి దింపారు.ఆ సైకిల్‌కు హ్యాండిల్ లేదు, సీట్లు లేవు..పెడల్స్ లేవు, చక్రాలు లేవు.సైకిల్ బెల్ ఒకటే మిగిలింది అదే అబద్దాల మేనిఫెస్టో అని జగన్ పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఏపీ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అన్నారు. వైసీపీకి ఓటు వేస్తే.. పథకాల కొనసాగుతాయన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, మోసపోవడమేనని జగన్ తెలిపారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే..చంద్రముఖిని నిద్రలేపడమేనని చెప్పారు. ప్రజల ఇంటివద్దకే అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని జగన్ కోరారు.