CM Jagan: విదేశీ పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్నారు సీఎం జగన్ . ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం యూరప్ యాత్రకు వెళ్లారు జగన్ . చంద్రబాబు కూడా దుబాయ్ అటు నుంచి అమెరికా వెళ్లి వచ్చారు .ఎన్నికల ప్రచారంలో బాగా బిజీగా గడిపిన నేతలు ఆటవిడుపు కోసం విదేశాలు వెళ్లారు . విశ్రాంతి కోసమని అని కొంతమంది నాయకులు, వైద్య పరీక్షల నిమిత్తం అని ఇంకొంతమంది నేతలు వివిధ ప్రాంతాలకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ తన పర్యటన ముగించుకుని ఏపీకి వచ్చారు . శనివారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో సహా రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయం వద్ద సీఎం జగన్ కు నాయకులు, కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్ కు స్వాగతం పలికారు. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలూ పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడి నుంచి ఆయన నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం..(CM Jagan)
ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత మే 17వ తేదీన సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లండన్, స్విట్జర్లాండ్ దేశాల్లో కుటుంబసమేతంగా ఆయన పర్యటించారు. ఈ క్రమంలో పదిహేను రోజుల తర్వాత తిరిగి నేడు స్వదేశానికి విచ్చేశారు. ఇక జూన్ 4వ తేదీన ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడో, రేపో ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.