CM Chandrababu Key Decision to Provide Gratuity to Asha Workers: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆశావర్కర్లకు గరిష్ట వయోపరిమితి పెంచుతూ సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఈ మేరకు ఆశా కార్యకర్తల గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచారు. దీంతో పాటు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ఆశా కార్యకర్తలు ప్రయోజనం పొందేలా గ్రాట్యుటీ చెల్లించే విధంగా సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉండగా.. గ్రామాల్లో 37,017 మంది, పట్టణాల్లో 5,735 మంది ఉన్నారు. ప్రస్తుతం ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10వేల జీతం అందుతోంది. కాగా, ఆశా కార్యకర్తలకు సర్వీస్ ముగింపులో గ్రాట్యుటీ కింద రూ.1.5 లక్షలు పొందే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఏపీ వార్షిక బడ్జెట్‌లో మహిళల కోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భారీ కేటాయింపులు చేశారు. మహిళలు, వృద్ధుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఏపీలో 10 లక్షలకుపైగా స్వయం సహాయక సంఘాలు రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి వివరించారు. అందుకే 2025-26 ఏడాదికి మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి రూ.4,332 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.