CM Relief fund Scam: సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంపై సీఐడీ కేసు నమోదు

:ముఖ్యమంత్రి సహాయ నిధి కుంభకోణంపై సిఐడి దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఉత్తుత్తి రోగులు, దళారులు, వైద్యులు, అధికారులు ఇలా అనేకమంది ఈ కుంభకోణంలో తమవంతు పాత్ర పోషించారని తేలింది. కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లభించడంతో అరెస్టులకి రంగం సిద్ధమైంది.

  • Written By:
  • Publish Date - July 1, 2023 / 02:25 PM IST

CM Relief fund Scam:ముఖ్యమంత్రి సహాయ నిధి కుంభకోణంపై సిఐడి దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఉత్తుత్తి రోగులు, దళారులు, వైద్యులు, అధికారులు ఇలా అనేకమంది ఈ కుంభకోణంలో తమవంతు పాత్ర పోషించారని తేలింది. కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లభించడంతో అరెస్టులకి రంగం సిద్ధమైంది. సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఇద్దరి పేరుతో ఈ కుంభకోణానికి శ్రీకారం చుట్టారు. లక్ష్మి, జ్యోతి అనే వారు మిర్యాలగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు, ఇందుకు అయిన ఖర్చు చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. పరిశీలన అనంతరం సిఎం సహాయనిధి నుంచి ఆరు లక్షల ఎనిమిది వేల 889 రూపాయలు మంజూరయ్యాయి.

ఆ తర్వాత ఇవే పేర్లతో ఖమ్మం జిల్లాలోని మరో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు కూడా దరఖాస్తులు వచ్చాయి. దాంతో అనుమానం వచ్చిన సహాయనిధి ఉద్యోగులు వీటిని పరిశీలించారు. ఇందులో మోసం జరిగినట్లు గుర్తించి గత ఏప్రిల్‌లో సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం దీన్ని హైదరాబాద్‌ సీసీఎస్‌కు బదీలీ చేశారు. సీసీఎస్‌ పోలీసులు మరో నాలుగు కేసులు నమోదు చేశారు. నలుగుర్ని అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగినట్లు తేలడంతో దీన్ని సీఐడీకి బదిలీ చేశారు.

ఆసుపత్రులు లేకుండానే బిల్లులు..(CM Relief fund Scam)

దళారులు సమర్పించిన బిల్లుల్లో అసలు కొన్ని ఆసుపత్రులే లేవని, లేనివాటితో బిల్లులు తయారు చేశారని వెల్లడైంది. ఇందులో కొందరు వైద్యులు, స్థానిక రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో పనిచేసేవారి వారి ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది. రెండు నెలలుగా సీఐడీ జరిపిన దర్యాప్తులో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని, దళారులు, నకిలీ రోగులు పదుల సంఖ్యలో ఉన్నారని, అయిదారు జిల్లాల్లో ఈ కుంభకోణం జరిగిందని తేలింది.