Cheetah Attack: తిరుమల నడకదారి 7వ మైలు వద్ద మూడేళ్ల బాలుడిపై చిరుత దాడి చేయడం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఐదేళ్ల బాలుడు తన తాతతో కలిసి కుర్ కురే ప్యాకెట్ కొనుక్కుంటున్న సందర్బంగాఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చిన చిరుత బాలుడి మెడ పట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నించింది. దీనిని గమనించిన దుకాణదారుడు, తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది వెంటనే పరుగులు తీయడంతో చిరుతపులి బాలుడిని వదిలి అడవిలోకి వెళ్లింది.
బాలుడిని పరామర్శించిన టీటీడీ ఛైర్మన్, ఈవో..(Cheetah Attack)
గాయపడిన బాలుడికి మెడ వెనుక భాగంలో గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీ పద్మావతి పిల్లల ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి బాలుడిని పరామర్శించి బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. గాయపడిన బాలుడు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కౌశిక్ గా సమాచారం. ఇక నడక దారిలో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అటవీ సిబ్బంది సూచిస్తున్నారు.
ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించి బాలుడికి మెరుగైన వైద్యం అందిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. బాలుడిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నామని అన్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. మరో రెండు రోజుల్లో బాలుడిని క్షేమంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని చైర్మన్ తెలిపారు