Chandragiri DSP Sarath Rajkumar: తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్‌కుమార్‌పై వేటు పడింది. ఆయన్ను డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. చంద్రగిరిలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత జరిగిన ఘటనల విషయంలో చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణమని సమాచారం.
నియోజకవర్గంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో విఫలం కావడం.. పోలింగ్ రోజు రాత్రి జరిగిన ఘర్షణలుపై తెలుగు దేశం పార్టీ నేతలు ఆరోపణలు చేయడంతో పాటుగా సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. రాజ్‌కుమార్ మూడు నెలల క్రితం చంద్రగిరి డీఎస్పీగా వచ్చారు. మరో వాదన కూడా వినిపిస్తోంది.. డీఎస్పీ రాజ్‌కుమార్ తన స్నేహితుడైప హోమియోపతి డాక్టర్‌ను స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకెళ్లారని.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను చూసి ఈసీ సీరియస్ కావడంతో చర్యలు తీసుకున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఈ నెల 13వ తేదీ పోలింగ్ రోజున రాత్రి.. చంద్రగిరి మండలం కూచివారిపల్లె, రామిరెడ్డిపల్లెల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి . ఈ దాడులకు చంద్రగిరి పోలీసుల వైఫల్యమే కారణమని ఎన్నికల కమిషన్‌కు వినీత్ బ్రిజిలాల్ నాయకత్వంలోని సిట్ బృందం రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది . ఈ రిపోర్ట్ ఆధారంగానే చంద్రగిరి డీఎస్పీపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్‌కుమార్‌ను వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆ ఉత్తర్వు లో పేర్కొన్నారు .