Chandrababu Remand: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు రిమాండుని అక్టోబర్ 5 వరకూ విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. నేటితో సిఐడి రెండు రోజుల కస్టడీ ముగిసింది. చంద్రబాబు విచారణకి సహకరించలేదని అంటున్న సిఐడి అధికారులు చంద్రబాబుని మరోసారి కస్టడీకి తీసుకుని ప్రశ్నించాలని నిర్ణయించారు. దీనిపై సోమవారంనాడు నిర్ణయం తీసుకోనున్నారు. సోమవారంనాడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది.
చంద్రబాబుకు 120 ప్రశ్నలు..( Chandrababu Remand)
చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలులో రెండు రోజులపాటు సిఐడి అధికారులు ప్రశ్నించారు. 12 గంటలపాటు వివిధ కోణాల్లో 120 ప్రశ్నలు సంధించారు. కేసుకి సంబంధించిన ఫైళ్ళని కూడా చంద్రబాబుకి చూపించారు. అయితే వేటికీ చంద్రబాబు స్పష్టంగా సమాధానాలివ్వలేదని సిఐడి అధికారులు అంటున్నారు. చంద్రబాబుని కస్టడీలోకి తీసుకునే ముందు, తరువాత సిఐడి అధికారులు వైద్య పరీక్షలు చేయించారు. రాజమండ్రి సెంట్రల్ జైలునుంచి వర్చువల్‌గా ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కస్టడీ ముగియడంతో సిఐడి అధికారులని చంద్రబాబు దగ్గరనుంచి వెళ్ళిపోవాలని ఎసిబి కోర్టు జడ్జి ఆదేశించారు. దీంతో సిఐడి అధికారులు జైలునుంచి వెళ్ళిపోయారు. జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని జైలు అధికారులకి జడ్జి ఆదేశించారు. రిమాండ్ పొడిగించాలని సిఐడి అధికారులు మెమో దాఖలు చేశారు. సిఐడి అధికారుల పిటిషన్‌పై చంద్రబాబు తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంతా అయిపోలేదు..
చంద్రబాబుతో ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు నేరుగా మాట్లాడారు. తనకి సంబంధం లేని కేసులో ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు జడ్జికి చెప్పారు. అయితే మీపై రెండు వేల పేజీల్లో 600 అభియోగాలున్నాయని. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని మళ్ళీ చెబుతున్నానని జడ్జి చంద్రబాబుకి చెప్పారు. విచారణ సమయంలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా.? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా అని జడ్జి ఆరా తీశారు. లేదని చెప్పిన చంద్రబాబు విచారణకి తాను సహకరించానని, విచారణ సమయంలో ఏం గుర్తించారో బయటపెట్టాలని జడ్జిని కోరారు. కేసు దర్యాప్తులో ఉండగా వివరాలు బయటపెట్టడం కుదరదన్న జడ్జి ఇప్పుడే అంతా అయిపోయిందని అనుకోకండని అన్నారు. రేపు మీ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఉంది, సిఐడి సమర్పించిన ప్రాథమిక సాక్ష్యాల పత్రాలని మీ లాయర్లని అడిగి తెలుసుకోండని జడ్జి హిమబిందు సూచించారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఫైబర్ గ్రిడ్ విషయంలో దాఖలైన రెండు పీటీ వారెంట్లపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.