Chandrababu Naidu Cases Updates: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 15కి వాయిదా పడింది. నేటి విచారణకి అదనపు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు ప్రత్యేక పిపి వివేకానంద తెలిపారు. ఈ నెల 22కి విచారణ వాయిదా వేయాలని సిఐడి ప్రత్యేక పిపి అడిగారు. అయితే మరోసారి గడువు పొడిగించేది లేదని చెప్పిన హైకోర్టు., స్కిల్ కేసు విచారణని ఈ నెల 15కి వాయిదా వేసింది.
చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ నిందితులుగా ఉన్న అమరావతి అసైన్డ్ భూముల కేసు విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది. అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు, నారాయణ వేసిన క్వాష్ పిటిషన్ విచారణని మళ్ళీ ప్రారంభించాలని ఏపీ సిఐడి పిటిషన్ వేసింది. కేసు రీ ఓపెన్ ఎందుకు చేయాలో చెబుతూ ఇప్పటికే ఆడియో వీడియో టేపులని సిఐడి అధికారులు కోర్టుకి సమర్పించారు. అయితే ఇరువర్గాల లాయర్లు సమయం కోరడంతో హైకోర్టు విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసుని సిబిఐకివ్వాలన్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్‌పై విచారణని ఈ నెల 29కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. అయితే ఈ కేసులో ఏపీ హైకోర్టు జారీ చేసిన నోటీసులు అందరకీ చేరలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. నోటీసులు అందరికీ ఎందుకు అందలేదో పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.