Site icon Prime9

Airport in Warangal: తెలంగాణలో మరో ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. మామునూరులోనే ఎందుకంటే?

Central Government Gives Green Signal To Airport in Warangal: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్. తెలంగాణలో మరో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు ఎయిర్‌పోర్టు ఆపరేషన్స్‌కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ విషయంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్లు విడుదల చేసింది. దీంతో 696 ఎకరాల భూసేకరణ పూర్తవ్వగా.. మరో 253 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా రన్‌వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నేవిగేషన్ ఇన్‌స్టుమెంట్ ఇన్‌స్టలేషన్ వంటి నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉంది. తాజాగా, కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో నిర్మాణ పనులు ముమ్మరం కానున్నాయి.

అయితే, గతంలో జీఎంఆర్ సంస్థతో ఓ ఒప్పందం జరిగింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కనీసం 150 కి.మీ పరిధిలో మరో ఎయిర్‌పోర్టు ఉండొద్దనే ఒప్పందం జరిగింది. ఈ మేరకు జీఎంఆర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయడు ప్రత్యేక చర్చలు జరిపారు. ఈ భేటీలో భాగంగానే జీఎంఆర్ సంస్థ మామునూరుకు అంగీకరించింది. జీఎంఆర్ సంస్థ అంగీకారంతో ఎయిర్‌పోర్టు పనులు త్వరితగతిన చేపట్టాలని పౌరవిమానయాన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదిలా ఉండగా, నిజాం కాలంలో మామునూరు నుంచి వాయుదూత్ విమానాలు నడిపేవారు. భారత్, చైనా యుద్ధం జరుగుతుండగా..ఇక్కడి నుంచి పలు రకాల కీలక సేవలందాయి. ఆ తర్వాత మామునూరు ఎయిర్‌పోర్టు మూతపడింది. అక్కడ అప్పుడప్పుడు ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు మాత్రమే నడుస్తున్నాయి. మళ్లీ 32 ఏళ్ల తర్వాత మామునూరు ఎయిర్‌పోర్టుకు రెక్కలు రావడంతో ఇక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar