MLA Arikapudi Gandhi: గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. టీ కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి గులాబీ పార్టీ చతికిలపడిపోతోంది. ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి హస్తం గూటికి చేరుతుండడంతో గులాబీ పార్టీ ఖాళీ అవుతోంది. నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్..బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరగా..కాసేపటి క్రితమే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సైతం కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అరికపూడితో పాటు పలువురు కార్పొరేటర్లు,నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ పార్టీని వీడిని 9 మంది ఎమ్మెల్యేలు..(MLA Arikapudi Gandhi)
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ సొంత ఎమ్మెల్యేలే వరుస షాక్ లిస్తున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా అరికపూడి గాంధీ చేరికతో ఆ సంఖ్య 9కి చేరినట్లు అయింది. అయితే గ్రేటర్ పరిధిలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇంకా ఎవరెవరు హస్తం పార్టీలో చేరుతారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. రేపు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు కూడా చేరబోతున్నట్లు సమాచారం.