GHMC: హైదరాబాద్ అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా అందరిని కలచివేసింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని.. ఇది వరకే మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇప్పుడు ఆ బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ ఆర్ధిక సాయం ప్రకటిచింది.
బాలుడి కుటుంబానికి ఆర్ధిక సాయం.. (GHMC)
సంచలనం రేపిన వీధి కుక్కల దాడి ఘటనలో బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ నష్టపరిహారం అందించనుంది. మృతి చెందిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ప్రకటించింది.
బాధిత కుటుంబానికి జీహెచ్‌ఎంసీ నుంచి రూ.8లక్షలు కాగా.. కార్పొరేటర్ల నెల జీతం నుంచి రూ.2లక్షలు కలిపి మొత్తం రూ.10లక్షల ఆర్ధిక సాయన్ని అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. బాలుడి మృతి పట్ల.. హైకోర్టు ఇప్పటికే సుమోటో పిటిషన్‌గా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి దీనిపై విచారణ జరిపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ తో పాటు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. కుక్కలు వీధుల్లో తిరగకుండా ఎలాంటి కార్యచరణ అమలు చేస్తున్నారో ప్రణాళిక సమర్పించాలని తెలిపింది.
సీసీటీవీలో కలవరపరిచే దృశ్యాలు..
వీధికుక్కలు విచక్షణరహితంగా దాడి చేయడంతో.. బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్.. ఉపాధి నిమిత్తం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. అంబర్ పేట్ పరిధిలోని ఓ కార్ సర్వీస్ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో.. కుమార్తె, కమారుడిని తాను పనిచేస్తున్న సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లాడు. కుమార్తెను అక్కడే ఉంచి.. కుమారుడిని సర్వీస్ సెంటర్ లోపలికి తండ్రి తీసుకెళ్లాడు. కాసేపు అక్కడే ఆడుకున్న కుమారుడు.. అక్క కోసం క్యాబిన్ వైపు వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. కుక్కలు పరుగెత్తుకు రావడంతో భయపడిన బాలుడు పరుగులు తీశాడు. చిన్నారిని వదలకుండా కుక్కలు తీవ్రంగా దాడి చేశాయి. బలంగా కాళ్లు, చేతులను లాగడంతో తీవ్ర గాయాలయ్యాయి.
బాలుడి మృతి పై స్పందించిన కేటీఆర్
బాలుడి మృతిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బాలుడి మృతి చాలా బాధాకరమని కేటీఆర్ అన్నారు. నగరంలో కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని అన్నారు. పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని కేటీఆర్ సూచించారు. నగరంలో వీధి కుక్కల సంఖ్య పెరుగుతోందని.. వాటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. మృతి చెందిన బాలుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు.