Heavy Heat Waves In Telugu States: బిగ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు భగభగమంటూ నిప్పులు చిమ్ముతున్నాడు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాలులు దడ పుట్టిస్తున్నాయి.
ఏపీలో ఇవాళ 50 మండలాలకు పైగా వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు చోట్ల అకాల వర్షాలు, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే విధంగా తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది.
ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతుండడంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా తెలంగాణలో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. తాజాగా, ఆదిలాబాద్ జిల్లాలో గరిష్టంగా 38 డిగ్రీలు, హైదరాబాద్‌లో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. గరిష్టంగా ఆదిలాబాద్ జిల్లాలో 38.8 డిగ్రీలు, నిజామాబాద్‌లో 37.8 డిగ్రీలు, భద్రాచలంలో 37.2 డిగ్రీలు, మహబూబ్ నగర్‌లో 35.6 డిగ్రీలు, మెదక్‌లో 34.6 డిగ్రీలు, హైదరాబాద్‌లో 33.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆంధ్రలో కూడా ఎండ తీవ్రత దంచికొట్టింది. ఏపీలో అత్యధికంగా అనకాపల్లిలో 40.2 డిగ్రీలు, అనంతపురం జిల్లాలో 39.9 డిగ్రీలు, కడపలో 39.8 డిగ్రీలు, చిత్తూరులో 39.7 డిగ్రీలు, నంద్యాలలో 39.6 డిగ్రీలు, ప్రకాశంలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.