Gannavaram Airport: విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీ విమానం ఎయిర్ బస్ 340 వచ్చింది.ఏపీ హజ్ యాత్రికులను తీసుకువెళ్లేందుకు ఆ విమానం వచ్చింది . ఈ భారీ విమానానికి వాటర్ కానన్ తో ఎయిర్‌పోర్ట్ అధికారులు ఘన స్వాగతం పలికారు. హజ్ యాత్రికుల కోసం స్పైస్ జెట్ సంస్థ ప్రత్యేకంగా నడుపుతున్న లెజెండ్ ఎయిర్‌లైన్స్‌కు చెందినది ఎయిర్‌బస్ ఎ340–300 విమానం . గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత భారీ విమానాలు రావడానికి మార్గం సుగమమైంది.
300 మందికి పైగా ప్రయాణించవచ్చు..(Gannavaram Airport)
ఈ విమానాన్ని చూసేందుకు ప్రజలు విమానాశ్రయానికి తండోప తండాలుగా వస్తున్నారు. సాధారణంగా విమానంలో 200 మంది వరకు ప్రయాణించవచ్చు. ఎయిర్ బస్ 340లో మాత్రం 300 నుంచి 350 మంది వరకు ప్రయాణం చేయొచ్చు. మొదటి విడత హజ్ యాత్రికులను ఎక్కించుకుని ఈ విమానం బయలుదేరి వెళ్లింది. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి, హజ్ ఆపరేషన్స్ చైర్మన్ హర్షవర్ధన్ పచ్చ జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత తొలిరోజు 322 మంది వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 692 మంది ముస్లిం సోదరులు హజ్ యాత్రకు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరంతా సౌదీ అరేబియాలోని జెడ్డా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రార్థనామందిరానికి చేరుకుంటారు.