CBI: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖకు సీబీఐ బదులిచ్చింది. 11,12,14,15 తేదీల్లో ఓ రోజును కన్ఫార్మ్ చేయాలని సీబీఐని కవిత కోరగా ఈ కేసులో వివరణ ఇచ్చేందుకు 11వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని నివాసంలో అందుబాటులో ఉండాలని చెప్తూ సీబీఐ బదులిచ్చింది. ఈ తేదీని కన్ఫార్మ్ చేయాలని అందులో కోరింది. ఈ లేఖను సీబీఐ ఏసీబీ డీఐజీ రాఘవేంద్ర వత్స రాశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ అధికారులు ఇటీవల కవితకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో గానీ, ఢిల్లీనివాసంలో గానీ ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు విచారించాలని అనకుంటున్నామని చెప్పారు. విచారణ ప్రదేశాన్ని తెలియజేయాని కోరారు. అయితే దీనిపై స్పందించిన కవిత హైదరాబాద్‌లోని నివాసంలో విచారణ అధికారులకు సమాధానమిస్తానని చెప్పారు. తరువాత లిక్కర్ స్కామ్‌పై వచ్చిన ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్ ప్రతులను ఇవ్వాలని లేఖలో సీబీఐని కవిత కోరారు. డాక్యుమెంట్లు ఇస్తే వేగంగా సమాధానాలు ఇచ్చేందుకు వీలవుతుందని తెలిపారు. కవిత లేఖపై స్పందించిన సీబీఐ అధికారులు.. సీబీఐ వెబ్‌సైట్‌లో ఆ వివరాలు అందుబాటులో ఉన్నాయని ఈ-మెయిల్ ద్వారా కవితకు తెలియజేశారు. ఈ క్రమంలోనే వాటిని పరిశీలించిన కవిత.. తాజాగా మరోమారు సీబీఐకి లేఖ రాశారు.
డిసెంబర్ 6వ తేదీన సీబీఐ అధికారులను కలవలేనని తెలిపారు. ముందుగా ఖరారైన కార్యక్రమాల కారణంగా హాజరుకాలేకపోతున్నట్టుగా చెప్పారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో విచారణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఆ తేదీల్లో హైదరాబాద్‌లోని తన నివాసంలోనే అందుబాటులోనే ఉంటానని స్పష్టం చేశారు. అందులో ఏ తేదీ అనుకూలమో త్వరగా తెలియజేయాలని కోరారు. సీబీఐ వెబ్‌సైట్‌లో ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను క్షుణం గా పరిశీలించానని చెప్పారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదని పేర్కొన్నారు. అయితే తాను చట్టాన్ని గౌరవిస్తానని.. దర్యాప్తుకు సహకరిస్తానని చెప్పారు.