AP New Cabinet: ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం..

ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా ప్రమాణం చేశారు.

  • Written By:
  • Publish Date - June 12, 2024 / 05:11 PM IST

AP New Cabinet: ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా ప్రమాణం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో అట్టహాసంగా ఈ వేడుక జరిగింది. వీరిద్దరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో తెదేపా నుంచి 20 మంది ఉండగా.. జనసేన నుంచి ముగ్గురు, భాజపా నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. సగానికిపైగా కొత్తవారికే అవకాశం దక్కింది. ముగ్గురు మహిళలకు చోటు కల్పించారు. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్య సామాజికవర్గం నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు మంత్రి పదవులు దక్కాయి.

కొత్త మంత్రుల వివరాలివే..(AP New Cabinet)

కొణిదెల పవన్‌ కల్యాణ్‌ (జనసేన)
నియోజకవర్గం: పిఠాపురం (కాకినాడ జిల్లా)
వయసు: 56 ఏళ్లు

మెగా స్టార్ చిరంజీవి తమ్ముడిగా 1996లో తెరంగేట్రం చేసిన పవన్‌ కల్యాణ్‌ పవర్‌స్టార్‌ ఇమేజ్‌తో తన కంటూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. 2008లో రాజకీయాల్లోకి వచ్చారు. సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. కామన్‌మెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (సీఎంపీఎఫ్‌) ట్రస్ట్‌ ద్వారా సేవలందించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనంతో బయటకు వచ్చి.. 2014లో జనసేన పార్టీని స్థాపించారు. అప్పటి ఎన్నికల్లో పోటికి దూరంగా ఉండి.. భాజపా, తెదేపాకు మద్దతు పలికి కూటమి అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించారు. 2019లో బీఎస్పీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి రెండుచోట్లా ఓటమి పాలైన వెనకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడి పోరాడారు. ఆ తర్వాత వైకాపా హయాంలో జరిగిన అరాచకాలు, జగన్ పరిపాలనా వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ఎండగట్టిన పవన్‌.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఏకైక అజెండాతో కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో రాజమహేంద్రవరం జైలులో ఆయన్ను కలుసుకొని బయటకు వచ్చిన పవన్‌.. క్లిష్టపరిస్థితుల్లో తెదేపాతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించి అండగా నిలిచారు. 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగంగా పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలన్నింటిలోనూ జనసేనకు రికార్డు విజయాన్ని అందించారు.

 

నారా లోకేశ్‌ (తెదేపా)
నియోజకవర్గం: మంగళగిరి (గుంటూరు జిల్లా)
వయసు: 41 ఏళ్లు

తండ్రి చంద్రబాబు అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేశ్‌ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై.. చంద్రబాబు మంత్రివర్గంలో ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఏపీలో ఐటీ కంపెనీల స్థాపనకు కృషి చేశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2023 జనవరిలో యువగళం పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 4వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలు విన్నారు. పార్టీ బలోపేతానికి పని చేశారు. తాజా ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి 91వేలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు.

 

కింజరాపు అచ్చెన్నాయుడు (తెదేపా)
నియోజకవర్గం: టెక్కలి (శ్రీకాకుళం జిల్లా)
వయసు: 54 ఏళ్లు

1995లో హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన అచ్చెన్నాయుడు 1999, 2004 ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2009 నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో టెక్కలి నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో అదే సీటు నుంచి గెలుపొంది ఐదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పటికీ పార్టీ అధికారం కోల్పోవడంతో శాసనసభాపక్ష ఉపనేతగా వ్యవహరించారు. 2021లో పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. తాజా ఎన్నికల్లో 34వేల పైచీలుకు ఓట్లతో గెలుపొందారు.టీడీపీ సీనియర్ నేత కింజరాపు ఎర్రన్నాయుడు సోదరుడే

 

కొల్లు రవీంద్ర (తెదేపా)
నియోజకవర్గం: మచిలీపట్నం (కృష్ణా జిల్లా)
వయసు: 51 ఏళ్లు

1999 అసెంబ్లీ ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మత్స్యశాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన నదుకుదుటి నరసింహారావు అల్లుడే
కోళ్లు రవీంద్ర. ఆయన వారసునిగా 2005లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెదేపా డివిజన్‌ అధ్యక్షుడిగా, 2007లో తెలుగుయువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2015 నుంచి కొల్లు ఫౌండేషన్‌ ద్వారా సేవాకార్యక్రమాలు, అన్న క్యాంటీన్ల ద్వారా అన్నదానం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, పార్టీ బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్‌గా, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014లో చంద్రబాబు హయాంలో ఎక్సైజ్, చేనేత, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైనా తాజాగా మచిలీపట్నం నుంచి భారీ మెజార్టీతో గెలుపొంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు .

 

నాదెండ్ల మనోహర్‌ (జనసేన)
నియోజకవర్గం: తెనాలి (గుంటూరు జిల్లా)
వయసు: 60 ఏళ్లు

తొలి సారిగా 2004లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో రెండోసారి విజయం సాధించి ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. 2011లో శాసనసభ స్పీకర్‌గా ఎన్నికై 2014 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మనోహర్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2018లో జనసేనలో చేరారు. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2024లో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగి 50వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా మొదటిసారి అవకాశం దక్కించుకున్నారు. మనోహర్ తండ్రి భాస్కర్ రావు 1984 లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడకొట్టి ముఖ్యమంత్రిగా కొంత కాలం కొనసాగారు .భాస్కర్ రావు కూడా తెనాలి నుంచి 1989 లో ఎమ్మెల్యే గా విజయం సాధించారు .

 

డాక్టర్‌ పొంగూరు నారాయణ (తెదేపా)
నియోజకవర్గం: నెల్లూరు నగరం (నెల్లూరు జిల్లా)
వయసు: 68 ఏళ్లు
ఆసియాలోనే అతిపెద్ద విద్యాసంస్థను ఏర్పాటుచేసిన విద్యావేత్త నారాయ‌ణ.. నెల్లూరులోని వి.ఆర్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్‌గా పనిచేశారు. 1979లో ఓ చిన్న అద్దె గదిలో నారాయణ ట్యూషన్ సెంటర్‌ను మొదలుపెట్టారు. అదే నారాయణ విద్యాసంస్థలుగా 14 రాష్ట్రాల్లో 4 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యను అందిస్తోంది. 1998లో చంద్రబాబుతో పరిచయం డాక్టర్ నారాయణను రాజకీయాల వైపు తిప్పింది. తొలుత టీడీపీ సర్వే విభాగానికి పనిచేసి.. క్రమంగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో చంద్రబాబు హయాంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పట్టణాభివృద్ధి, అర్బన్‌ హౌసింగ్‌ శాఖల మంత్రిగా చేశారు. నెల్లూరులో నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో రోజుకు దాదాపు 13 వందల మంది నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు.

అనిత వంగలపూడి (తెదేపా)
నియోజకవర్గం: పాయకరావుపేట (విశాఖపట్నం)

ఉమ్మడి విశాఖ జిల్లా రాజవరంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే అనిత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో తొలిసారి పాయకరావుపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2018లో టీటీడీ బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు. గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి ఓటమిపాలైన తర్వాత ఏపీ తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి మరోసారి గెలుపొంది.. ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

నిమ్మల రామానాయుడు (తెదేపా)
నియోజకవర్గం: పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా)
వయసు: 55 ఏళ్లు
జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రామానాయుడు.. పాలకొల్లును తెదేపాకు కంచుకోటగా మార్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో రాష్ట్రంలో వైకాపాకు అత్యధిక స్థానాలు దక్కినప్పటికీ నిమ్మల 17వేల మెజార్టీతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లోనూ నియోజకవర్గంలో 70 శాతం మంది ఓటింగ్‌ సాధించి.. జిల్లాలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నేతగా గుర్తింపు పొందారు.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రామానాయుడు కొంతకాలం నరసాపురం వైఎన్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు.

పయ్యావుల కేశవ్‌ (తెదేపా)
నియోజకవర్గం: ఉరవకొండ (అనంతపురం)
రాజకీయ అనుభవం: పయ్యావుల కేశవ్‌ దాదాపు 30 ఏళ్ల కిందట రాజకీయ అరంగేట్రం చేశారు. 1994లో ఎన్టీఆర్‌ పిలుపుతో ఉరవకొండ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994, 2004, 2009, 2019లో ఎమ్మెల్యేగా పని చేశారు. 2015 నుంచి 2019 వరకు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా పని చేశారు. ఇప్పుడు ఏడోసారి తెదేపా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్‌ గాలిని తట్టుకొని ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయనకు తెదేపా అధినేత ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నా, ఇప్పటివరకూ మంత్రిగా అవకాశం రాలేదు. ఎట్టకేలకు మొదటిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టబోతున్నారు.

గుమ్మిడి సంధ్యారాణి (తెదేపా)
నియోజకవర్గం: సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా)
వయసు: 51
రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సంధ్యారాణి.. తొలుత ఉపాధ్యాయురాలిగా పని చేశారు. తండ్రి జన్ని ముత్యాలు స్ఫూర్తితో పాతికేళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999లో కాంగ్రెస్‌ తరఫున సాలూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల తర్వాత హస్తాన్ని వీడి తెదేపాలో చేరారు. 2009 అసెంబ్లీ, 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. 2015లో తెదేపా నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. 2020లో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈసారి సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరపై భారీ విజయం సాధించారు.

అనగాని సత్యప్రసాద్‌ (తెదేపా)
నియోజకవర్గం: రేపల్లె (బాపట్ల జిల్లా)
వయసు: 52

ఉమ్మడి గుంటూరు జిల్ రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు అనగాని సత్య ప్రసాద్ . 2009లో తెదేపాలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి మోపిదేవి వెంకట రమణ చేతిలో ఓడిపోయారు. 2014, 2019లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి మోపిదేవిని ఓడించారు. తాజా ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచి.. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం పొందారు.సత్య ప్రసాద్ బంధువు అనగాని భగవంతరావు గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసారు .

డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి (తెదేపా)
నియోజకవర్గం: కొండపి (ప్రకాశం జిల్లా)
వయసు: 54
కొండపినుంచి హ్యాట్రిక్ సాధించిన బాల వీరాంజనేయస్వామి , ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యునిగా పనిచే చేశారు .గతంలో ఈ ప్రాంతంలో గట్టి పట్టున్న దామచర్ల ఆంజనేయులు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో తొలిసారి కొండపి స్థానం నుంచి విజయం సాధించారు. అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచారు. 2014-19 మధ్య టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేశారు. 2019-24 వరకు తెలుగుదేశం శాసన సభాపక్షానికి విప్‌గా వ్యవహరించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శిగానూ పనిచేశారు.

గొట్టిపాటి రవికుమార్‌ (తెదేపా)
నియోజకవర్గం: అద్దంకి (బాపట్ల జిల్లా)
వయసు: 48

సీనియర్ రాజకీయ నేత గొట్టిపాటి హనుమంతరావు తమ్ముడు శేషగిరి రావు కుమారుడు గొట్టి పాటి రవికుమార్ .స్థానికంగా అందరు బుజ్జి అని పిలుచుకుంటారు . గ్రానైట్‌ ,కాటన్ వ్యాపారి అయిన గొట్టిపాటి 2004లో ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో మార్టూరు రద్దవ్వడంతో అద్దంకి కి మారి అక్కడి నుంచి విజయం సాధించారు. 2014లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2016లో తెదేపాలో చేరి 2019, 2024 ఎన్నికల్లో గెలిచారు. వైకాపా హయాంలో తీవ్రంగా ఇబ్బంది పడిన వారిలో గొట్టిపాటి రవి ఒకరు. ఆయన వ్యాపారాల్ని గత ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసింది. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కడంతో తొలిసారి మంత్రి అవుతున్నారు.గొట్టిపాటి కుటుంబానికి కరణం కుటుంబానికి రాజకీయ వైరం ఉండడం తెలిసిన విషయమే .

కందుల దుర్గేశ్‌ (జనసేన)
నియోజకవర్గం: నిడదవోలు
కాంగ్రెస్‌ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన దుర్గేశ్‌ వివిధ హోదాల్లో పనిచేసి 2007 -2013 ఎమ్మెల్సీ గా కొనసాగారు .ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్‌సభ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు. 2018 ఆగస్టు 30న జనసేనలో చేరిన దుర్గేశ్‌ 2019 శాససనసభ ఎన్నికల్లో రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నుంచి విజయం సాధించి మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు.

బీసీ జనార్దనరెడ్డి (తెదేపా)
నియోజకవర్గం: బనగానపల్లి (నంద్యాల జిల్లా)
వయసు: 55
ఫ్యాక్షన్ ప్రాంతమైన బనగాన పల్లి నుంచి రెండవ సారి గెలుపొందారు బొబ్బల చిన్నోళ్ల జనార్ధనరెడ్డి . 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఓటమిపాలైన ఆయన తాజా ఎన్నికల్లో బనగానపల్లి నుంచి 25వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.తాజాగా మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు .

 

పేరు: టీజీ భరత్‌ (తెదేపా)
నియోజకవర్గం: కర్నూలు (కర్నూలు జిల్లా)
వయసు: 48

తండ్రి టీజీ వెంకటేశ్‌ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన భరత్‌ 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.తండ్రి వెంకటేష్ బీజేపీలోకి వెళ్లినప్పటికీ భరత్ టీడీపీలోనే కొనసాగారు . తాజా ఎన్నికల్లో గెలిచి తొలిసారి శాసనసభలో అడుగుపెడుతున్నారు.తొలిసారి గెలుపొంది నప్పటికీ మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు .

ఎస్‌. సవిత (తెదేపా)
నియోజకవర్గం: పెనుకొండ (శ్రీసత్యసాయి జిల్లా)
సవిత తండ్రి ఎస్‌ రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తెలుగు దేశం పార్టీ నుంచి 1996 లో లోక్ సభకు ఎన్నికయాయ్రు . ఆయన వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సవిత తాజా ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు. వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఉషశ్రీచరణ్‌పై 33 వేల మెజార్టీతో విజయం సాధించారు. తండ్రి పేరుతో ఎస్‌ఆర్‌ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెనుకొండ పట్టణంలో కొన్నేళ్లుగా అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తూ రూ.5 భోజనం అందిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి మైనార్టీలకు రంజాన్‌ తోఫా పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో కురుబ సామాజికవర్గం నుంచి సవిత ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు.

పేరు: వాసంశెట్టి సుభాష్‌ (తెదేపా)
నియోజకవర్గం: రామచంద్రపురం
శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన సుభాష్‌ తాత సత్తిరాజు, తండ్రి సత్యం రాజకీయ నేపథ్యం వున్నా వారే . చెరు రెండుదఫాలు చొప్పున అమలాపురం మున్సిపల్‌ కౌన్సిలర్లుగా పనిచేశారు. తల్లి కృష్ణకుమారి ప్రస్తుతం కౌన్సిలర్‌. తనకున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు . శెట్టిబలిజ సామాజికవర్గం యువతలో సుభాష్‌ మంచి పట్టు సాధించారు. వైకాపా రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. అమలాపురం అల్లర్ల ఘటన తర్వాత వైకాపా నాయకులతో విభేదాలు రావడంతో తెదేపాలో చేరారు. తాజా ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి సీనియర్ నాయకుడు అదే శెట్టి బలిజ సామజిక వర్గం కు చెందిన పిల్లి సుభాష్ చంద్ర బోస్ కుమారుడు పిల్లి సూర్య ప్రకాష్ పై ఎమ్మెల్యేగా నెగ్గారు.ప్రస్తుతం మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు .

 

పేరు: కొండపల్లి శ్రీనివాస్‌ (తెదేపా)
నియోజకవర్గం: గజపతినగరం (విజయనగరం జిల్లా)
వయసు: 42
ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొండపల్లి కుటుంబానికి మంచి పేరు వుంది . రాజకీయ నేపథ్యం కుటుంబం . తాత పైడితల్లినాయుడు మూడుసార్లు బొబ్బిలి పార్లమెంట్‌ సభ్యుడిగా గెలిచారు. తండ్రి కొండలరావు మండల పరిషత్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసిన శ్రీనివాస్‌ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆయన తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పల నర్సయ్యపై 24,302 ఓట్ల మెజార్టీతో గజపతి నగరం నియోజకవర్గం నుంచి విజయదుందుభి మోగించారు.టికెట్ విషయంలో సొంత బాబాయ్ తో పోటీ పడి మరి సాధించారు .

పేరు: నశ్యం మహమ్మద్ ఫరూక్‌ (తెదేపా)
నియోజకవర్గం: నంద్యాల (నంద్యాల జిల్లా )
వయసు: 74

రాజకీయ అనుభవం: 1981లో నంద్యాల మున్సిపల్‌ కౌన్సిలర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1985లో తొలిసారి నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపొంది.. అప్పట్లో చక్కెర పరిశ్రమ మంత్రిగా పనిచేశారు. 1994లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది, మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, ఉర్దూ అకాడమీ మంత్రిగా పనిచేశారు. 2017లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2017-18లో శాసనమండలి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018-19 మధ్య ఆరోగ్యశాఖ, మైనార్టీ శాఖల మంత్రిగా వ్యవహరించారు.టీడీపీ తరుపున గెలిచిన మైనార్టీలలో ఫరూక్ సీనియర్ .

పేరు: ఆనం రామనారాయణ రెడ్డి (తెదేపా)
నియోజకవర్గం: ఆత్మకూరు (నెల్లూరు జిల్లా)
వయసు: 72

1983లో నెల్లూరు అసెంబ్లీ ఎన్నికల్లో కేవీ ఎస్ రెడ్డిపై తెదేపా అభ్యర్థిగా విజయం సాధించారు. 1984లో రాష్ట్ర క్రీడామండలి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 1985లో రాపూరు అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా తరఫున గెలుపొంది ఆర్‌అండ్‌బీ మంత్రిగా పనిచేశారు. 1989 రాపూరు నుంచి ఓడిపోయి.. 1990లో ఏపీ వ్యాయామ ఉపాధ్యాయ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1999లో, 2004లోనూ రాపూరు నుంచి మళ్లీ వరుసగా గెలుపొందారు. రాష్ట్ర సమాచార టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి గెలిచి మున్సిపల్ మంత్రిగా వ్యవహరించారు. మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలోనూ పనిచేశారు. ఆనం కుటుంబంలో ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి, ఆనం సంజీవరెడ్డి మంత్రులుగా వ్యవహరించారు.

మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి (తెదేపా)
నియోజకవర్గం: రాయచోటి (అన్నమయ్య జిల్లా)
వయసు: 43

రాంప్రసాద్‌ రెడ్డి తండ్రి మండిపల్లి నాగిరెడ్డి రాయచోటి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలుపొందారు. రాంప్రసాద్ రెడ్డి పెద్దనాన్న కుమారుడు మండిపల్లి నారాయణరెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు.2014 సమైక్యాంధ్ర పార్టీ తరఫున రాంప్రసాద్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023 డిసెంబర్‌లో తెదేపాలో చేరారు. ఇటీవలి ఎన్నికల్లో వైకాపాకు గట్టి పట్టున్న రాయచోటిలో 2495 ఓట్ల మెజార్టీతో గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఓడించారు.

కొలుసు పార్థసారథి
నియోజకవర్గం: నూజివీడు (ఏలూరు జిల్లా)
వయసు: 59

కొలుసు పార్థసారథి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి కొలుసు పెద్దారెడ్డయ్య మచిలీపట్నం లోక్‌సభ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2004లో తొలుత ఊ య్యూరు నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2009 లో పెనమలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున విజయం సాధించారు . 2019లో పెనమలూరు నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ,కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందే తెదేపాలో చేరి నూజివీడు నుంచి ఎమ్మెల్యే గా గెలుపొందారు.

సత్యకుమార్‌ యాదవ్‌ (భాజపా)
నియోజకవర్గం: ధర్మవరం
వయసు: 53

ద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. మదనపల్లిలో చదువుకుంటున్న సమయంలో ఏబీవీపీ తరఫున కళాశాల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి వద్ద కొంతకాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. సత్యకుమార్‌ సేవలను గుర్తించిన భాజపా 2018లో జాతీయ కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర పార్టీ వ్యవహారాల సహ ఇన్‌ఛార్జిగా, అండమాన్‌ నికోబార్‌ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు.