Ap High court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్స్‌లో కట్టిన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర పంచాయతీ భవనాలను విద్యాశాఖకు అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్కూల్స్‌లో నిర్మాణాలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలుఇతర భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో వీటిని నిర్వహించడం వలన అక్కడకు వచ్చే ప్రజలు, రాజకీయనేతలతో విద్యార్దుల చదువులకు ఆటంకం కలుగుతుందని కొందరు కోర్టుకు వెళ్లారు. దీనితో ప్రభుత్వ పాఠశాలల్లో వాటి ఆవరణలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయంలో పలుమార్లు ఉన్నతాధికారులు హైకోర్టు ఎదుట హాజరయ్యారు. పదే పదే హైకోర్టు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ ఉల్లంఘిస్తున్నందున వారిని హైకోర్టు మరోసారి పిలిచింది.
తాజాగా ఈ కేసు విచారణ సందర్బంగా హైకోర్టు ఎదుట చీఫ్ సెక్రటరీ, పంచాయతీరాజ్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరయ్యారు. భవనాల విషయంలో పేరెంట్స్ కమిటీలతో మాట్లాడాలని పిటిషనర్ తరపు లాయర్ లక్ష్మీనారాయణ సూచించారు. లాయర్ సూచనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.