AP Assembly Session 2025: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం సభ ప్రారంభమైంది. ఇందులో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు తీరును ఎమ్మెల్యే కూన రవికుమార్ తప్పుబట్టారు.
కొత్త జిల్లాలకు చట్టబద్ధత ఏంటని ఆయన ప్రశ్నించారు. పేరుకే 26 జిల్లాలు చేశారే తప్పా ఎక్కడా మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. స్థానికత విషయంలో విద్యార్థులకు సమస్య వస్తోందని వివరించారు.
అలాగే, కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. గత ప్రభుత్వం పార్టీ ఆఫీసులు కట్టుకుందే తప్పా కలెక్టర్ ఆఫీసులు కట్టలేదన్నారు. కానీ జిల్లా కేంద్రాల్లో మౌలిక సదుపాయల కల్పనపై మేము దృష్టి సారించామని మంత్రి అన్నారు.
గత ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలకు విభజించిందని మంత్రి అనగాని ఆరోపించారు. ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చేలా విభజన జరిగిందన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరెట్లకు స్థలాలు కేటాయించలేదని, పార్టీ కార్యాలయాలు కట్టుకోవడంపై చూపించిన శ్రద్ధ, ప్రభుత్వ కార్యాలయాలపై చూపలేదని ఎద్దేవా చేశారు. అవసరమైన చోట్ల త్వరలో కలెక్టరేట్లు నిర్మిస్తామని తెలిపారు.