Korutla Case: జగిత్యాల జిల్లా కోరుట్లలో తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించిన బంకి దీప్తి కేసులో పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. సిసి కెమెరాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు బృందాలు ముందుకు సాగుతున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన బంకి శ్రీనివాస్ గత ముప్పై సంవత్సరాలుగా కోరుట్ల పట్టణంలోని భీమందుబ్బ ప్రాంతంలో నివసిస్తున్నారు. శ్రీనివాస్ ఇటుక బట్టీల వ్యాపారం చేస్తున్నారు. శ్రీనివాస్ దంపతులకి ఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లైన ఇద్దరు కూతుళ్ళు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. హైదరాబాద్‌లో బంధువుల ఇంట్లో శుభకార్యానికి శ్రీనివాస్ దంపతులు సోమవారంనాడు వెళ్ళారు.
ఫోన్ స్విచ్చాఫ్ చేసి..( Korutla Case)
మంగళవారం పెద్ద కూతురు దీప్తికి ఫోన్ చేస్తే స్పందన రాలేదు. చిన్న కూతురు చందన ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. పక్కింటి వారికి శ్రీనివాస్ ఫోన్ చేస్తే వాళ్ళు ఇంటికెళ్ళి చూశారు. అక్కడ పెద్ద కూతురు దీప్తి శవమై కనిపించింది. చిన్న కూతురు చందన ఇంట్లో కనిపించలేదు. దీంతో పోలీసులకి సమాచారం అందించారు. హుటాహుటిన శ్రీనివాస్ దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు. పోలీసులు సిసి కెమెరాలని పరిశీలిస్తే బస్టాండులో మరో యువకుడితో చందన కనిపించింది. నిజామాబాద్ బస్సు ఎక్కి వెళ్ళిందని, చందన ఫోన్ స్విచ్చాఫ్ చేసిందని గుర్తించారు. చందన కాల్ లిస్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు.
అక్క తాగి పడుకుంది..
తాను నిజామాబాద్ బస్సు ఎక్కినట్టు గుర్తించడంతో.. చందన తన తమ్ముడికి ఓ వాయిస్ మెసేజ్ ను పంపించింది. అందులో తాను తన అక్కను చంపలేదని.. తనకు హత్య చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఘటనకు ముందు తామిద్దరం మద్యం సేవించామని.. అయితే అక్క తాగిన తర్వాత సోఫాలో పడుకుందని.. అదే అదునుగా తాను ఇంట్లో నుంచి వెళ్లిపోయానన్నది. అక్క మొదట మద్యం తాగుదామంటే.. తన ఫ్రెండ్ తో తెప్పించానని.. అక్క హాఫ్ బాటిల్ తాగి పడుకున్న తర్వాత వెళ్లిపోయానని వాయిస్ లో తెలిపింది.