Anna Canteens: కూటమి ప్రభుత్వం వచ్చిందో లేదో అన్న క్యాంటీన్లకు మళ్లీ కళొచ్చింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం పేదల కోసం అన్నక్యాంటీన్లు ప్రారంభించింది. 5 రూపాయిలకే పేదలకు, నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించింది. టీడీపీ హయాంలో నిరాటంకంగా సాగిన ఈ కార్యక్రమం.. వైసీపీ అధికారంలోకి రాగానే దీనిని పక్కనపెట్టింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో.. మళ్లీ అన్న క్యాంటీన్లు తెరుచుకోనున్నాయి.
టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ, తిరుపతి, విశాఖ, గుంటూరు, అనంతపురం వంటి కీలకమైన 12 నగరాల్లో చాలా క్యాంటీన్లు పనిచేశాయి. వీటిని ఇస్కాన్ సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. పేదల నుంచి 5 రూపాయలు తీసుకుని మిగిలిన సొమ్ములో 50 శాతం ప్రభుత్వం, మిగిలిన సొమ్మును ఆయా నగర పాలక సంస్థలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో అన్నా క్యాంటీన్లు నిర్విఘ్నంగా సాగిపోయాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనిగట్టుకుని ఈ క్యాంటీన్లను తీసేశారు. గత ఐదేళ్లుగా అన్నక్యాంటీన్లు మూతపడ్డాయి. వైసీపీ నాయకులు అన్న క్యాంటీన్ భవనాలను నిరుపయోగంగా మార్చేశారు. దీనిపై గతంలోనే చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలను వైసీపీ సర్కార్ 2019లో అధికారంలోకి రాగానే పక్కకు పెట్టింది. వాటిని తిరిగి కంటిన్యూ చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు.. ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. అన్న క్యాంటీన్లు తెరిచేందుకు నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ విషయంలో అందరికంటే ముందు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉన్నారు. తన 64వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినందుకు.. హిందూపురం పరిధిలో మొట్టమొదటి అన్న క్యాంటీన్‌ను పున: ప్రారంభించారు. సుమారు 200 మంది పేదలకు మధ్యాహ్నం నుంచి ఉచితంగానే అన్నం వడ్డించారు. ఇక కొవ్వూరులో కూడా మరో అన్న క్యాంటీన్ ఓపెన్ అయింది.