Minister Adimulapu Suresh : గురువుల కన్నా గూగుల్ మిన్న అనే విధంగా వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసి.. గురువులను కించపరిచేలా మంత్రి ఈ విధంగా మాట్లాడడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిమూలపు సురేష్ క్షమాపణ చెప్పాలంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే..
ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన గురుపూజోత్సవ సభలో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. బైజూస్ తో టెక్నాలజీ మొత్తం ట్యాబుల్లో అందుబాటులో ఉందన్నారు. గురువుల స్థానంలో ఇప్పుడు గూగుల్ వచ్చిందని, ఉపాధ్యాయులకు తెలియని అంశాలు కూడా గూగుల్‌లో కొడితే వెంటనే తెలిసిపోతుందని చెప్పారు. గూగుల్ వచ్చిన తర్వాత గురువులు అవసరం లేని పరిస్థితి ఏర్పడిందంటూ మంత్రి సురేష్ వ్యాఖ్యానించారు. కాగా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏపీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
ఉపాధ్యాయులు మంత్రి మాటల పట్ల తీవ్రంగా మండి పడుతున్నారు. సాక్షాత్తూ గురుపూజోత్సవం రోజే మంత్రి ఈ విధంగా మాట్లాడడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. మాత, పిత, గురు దైవం అంటూ గురువులకు దేవుడి కన్నా గొప్ప స్థానాన్ని కలిగిస్తున్న మన సంస్కృతి, సాంప్రదాయాలను ఈ వ్యాఖ్యలతో భంగపాటు కలిగించారని సామాన్య ప్రజలు సైతం వైసీపీ మంత్రిపై ఫైర్ అవుతున్నారు.