Ysrcp Leaders : నందమూరి తారాక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై రజినీ పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు ఆ కారణంగా వైకాపా నేతలు వరుసగా రజినీకాంత్ ని టార్గెట్ చేస్తూ ఒకరి తర్వాత ఒకరుగా వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఈ విమర్శల పర్వం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రజినీకాంత్ కి కేవలం తమిళ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. మరి ఈ తరుణంలో వైకాపా నేతలు తలైవా మీద కామెంట్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎవరెవరు? ఏం అన్నారంటే?? Ysrcp Leaders..
మంత్రి రోజా కామెంట్స్ ..
ఎన్టీఆర్ జయంతి సభలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు హస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి రోజా అన్నారు. ఎన్టీఆర్ జయంతి సభలో ఆయనను వెన్నుపోటు పొడిచిన బాబును పొగడటం విడ్డూరంగా ఉందని.. సభకు పిలిచారు కాబట్టి బాబును పొడిగినట్లుగా ఉందని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన విషయం రజనీకాంత్‌కు తెలియదా అంటూ రోజా ప్రశ్నించారు. బాబు అధికారంలో ఉండగా ఎన్టీఆర్‌కు భారత రత్న అంశం గుర్తుకు రాదని.. ప్రధాని అయ్యే అవకాశం ఉన్న ఎన్టీఆర్ చావుకు బాబు కారణమంటూ ఆరోపించారు. 2013 వరకే బాబు హైదరాబాదుకు సీఎంగా ఉన్నారని.. 20 ఏళ్ల పాటు బాబు లేకుండానే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని గుర్తించాలని రోజా సూచించారు.
తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి..
నాడు వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు మద్దతుగా నిలిచినవాళ్లలో రజనీకాంత్ కూడా ఉన్నారని లక్ష్మీపార్వతి వెల్లడించారు. రజనీకాంత్ మరోసారి ఎన్టీఆర్ గురించి మాట్లాడితే ఊరుకోబోనని హెచ్చరించారు.తర్వాత కాలంలో ఎన్టీఆర్ ను కలిసిన రజనీకాంత్ తాను తప్పు చేశానని క్షమాపణ కోరారని ఆమె వివరించారు. అప్పట్లో వెన్నుపోటు వ్యవహారంలో రజనీకాంత్ ను తమిళ మీడియా కూడా విమర్శించిందని, దాంతో రజనీకాంత్ చాలాకాలం ఏపీ రాజకీయాలకు దూరంగా ఉన్నారని లక్ష్మీపార్వతి తెలిపారు. అయితే, చంద్రబాబు ఎంతో తెలివిగా మళ్లీ రజనీకాంత్ ను వాడుకుంటున్నారని, రజనీకాంత్ ద్వారా బీజేపీకి దగ్గరవ్వాలన్నది చంద్రబాబు ఎత్తుగడ అని ఆరోపించారు. సర్వేలన్నీ జగన్ కు అనుకూలంగా ఉండడంతో, చంద్రబాబు సినిమా వాళ్లతో నాటకాలు ఆడిస్తున్నారని విమర్శించారు.
మాజీ మంత్రి కొడాలి నాని..
సూపర్ స్టార్ రజినీ కాంత్ పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పై చెప్పులు విసురుతుండగా, వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతుగా ఉన్న రజినీకాంత్, సిగ్గు శరం లేకుండా ఇప్పుడు చంద్రబాబును పొగుడుతూ, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారని ఆయన మండిపడ్డారు. ఏపీలో జీరో అయిన రజినీకాంత్, మాటలను తెలుగు ప్రజలేవ్వరు విశ్వసించరని కొడాలి నాని అన్నారు. మూడు రోజులు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు హాస్పటల్లో పడుకునే, రజనీకాంత్ ఏం చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రజినీకాంత్ చదువుతూ తను వ్యక్తిగా మరింత దిగజారుతున్నాడంటూ నాని అన్నారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్ ..
ఏపీ రాజకీయాల గురించి రజనీకాంత్‌కి ఏం తెలుసు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆయన 10tv తో మాట్లాడుతూ.. సినిమాల్లో సూపర్ స్టార్ కావచ్చు. ఏపీ రాజకీయాల్లో మాత్రం ఆయనకు అవగాహన లేదని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు వైస్రాయ్ హోటల్‌లో చంద్రబాబుకి మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ వెంటిలేటర్‌పై టీడీపీకి మద్దతు కోసం తీసుకుని వచ్చాడు అంటూ విమర్శించారు. 2047లో ఏదో చేస్తారని రజనీకాంత్ చెప్తున్నాడు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడు. ఐదేళ్లు అమరావతిలో టెంపరరీ కట్టడాలు కట్టి అభివృద్ధి చేయకుండా ఉన్నది రజినీకాంత్ కి తెలియదా అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.